AB Venkateswararao Suspension Lifted : సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుపై ఏపీ ప్రభుత్వం సస్పెన్షన్ ఎత్తివేసింది. సస్పెన్షన్ తొలగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు జీఏడీలో రిపోర్టు చేయాలని సూచించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఇటీవల చీఫ్ సెక్రటరీని కలిసి ఏబీ వెంకటేశ్వరరావు రిపోర్టు చేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల అమలుకు పలుమార్లు సీఎస్ ను వెంకటేశ్వర రావు స్వయంగా కలిశారు. 2022 ఫిబ్రవరి 8 నుంచి ఆయనను సర్వీస్ లోకి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే తనను సస్పెన్షన్ చేసిన రోజు నుంచి సర్వీస్ లోకి తీసుకోవాలని ఏబీ కోరుతున్నారు. రెండేళ్ల సస్పెన్షన్ కాలాన్ని కూడా సర్వీస్ లోకి తీసుకోవాలని కోర్టు చెప్పిందని ఏబీ వాదిస్తున్నారు. సర్వీస్ నిబంధనలు అతిక్రమించి నిర్ణయాలు తీసుకున్నారనే కారణంతో ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఏపీ ప్రభుత్వం 2020 ఫిబ్రవరి 8న విధుల్లోంచి సస్పెండ్ చేసింది. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న సమయంలో భద్రతా ఉపకరణాలు కొనుగోలులో అక్రమాలు జరిగాయని వెంకటేశ్వరరావుపై ప్రభుత్వం వేటువేసింది.
సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను సుప్రీంకోర్టు ఇటీవల రద్దు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. రెండేళ్లకు పైగా సస్పెన్షన్ కొనసాగించడం కుదరదని ఆదేశాల్లో పేర్కొంది. ఏబీ వెంకటేశ్వరరావుకు తిరిగి పోస్టింగ్ ఇవ్వాలని సుప్రీంకోర్టు జస్టిస్ ఏ.ఎం.ఖన్విల్కర్ నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వా్న్ని ఆదేశించింది. ఈ ఆదేశాలతో ఏబీవీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రిపోర్టు చేశారు. పోస్టింగ్, పెండింగ్ జీతభత్యాల విషయాన్ని సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు. పోస్టింగ్ ఆదేశాలు ఇవ్వాలని సీఎస్‌ను కోరారు. సుప్రీం ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.
వివాదం ఏమిటి?
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సర్వీస్ నిబంధనలు అతిక్రమించారని ఏపీ ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. భద్రతా ఉపకరణాలు కొనుగోలులో నిబంధనలు అతిక్రమించారని ఆయనపై సస్పెన్షన్ వేటు వేసినట్లు ప్రభుత్వం గతంలో వెల్లడించింది. నిఘా పరికరాల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో పాటు కొందరు అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడి సర్వీసు నిబంధనలు ఉల్లంఘించారని ఆయనపై ప్రభుత్వం అభియోగాలు చేసింది. సస్పెన్షన్‌కు గురైన ఏబీ వెంకటేశ్వరరావు 1989 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన అధికారి. గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఏబీవీ పనిచేశారు.