అమరావతి: ఆక్వా రైతుల సంక్షేమం, వారి ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆక్వా రంగానికి మరింత ఊతమిచ్చేలా రైతులకు యూనిట్ విద్యుత్‌ను కేవలం రూ. 1.50 లకే సరఫరా చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6,500కు పైగా ఆక్వా ఫారాలకు ప్రత్యక్షంగా విద్యుత్ సబ్సిడీ లబ్ధి చేకూరనుంది.
ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఇంధన శాఖ అధికారికంగా G.O.Rt.No.57 ను జారీ చేసింది. ఈ పథకం అమల్లోకి రావడం వల్ల ఆక్వా రైతులకు సాగు వ్యయం గణనీయంగా తగ్గి, ఉత్పత్తి పెరగడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతులకు మంచి బలం చేకూరుతుంది. రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై రాష్ట్రంలోని ఆక్వా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
