రోడ్లపై గుంతలు పడితే నేరుగా యాప్ లోనే ఫిర్యాదు చేసే విధానాన్ని ఏపీ సర్కార్ తీసుకురానుంది. ఇందుకు సంబంధించిన యాప్ రూపకల్పనను నెలరోజుల్లో సిద్దం చేయాలని సీఎం జగన్ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ అధికారులను ఆదేశించారు. అంతే కాదు యాప్ రూపకల్పన చేసి రియల్ టైం మానిటరిగ్ చేపట్టాలని సీఎం జగన్ అధికారులకు స్పష్టం చేశారు.
రోడ్ల పరిస్థితిపై సీఎం జగన్ ఆరా
ఏపీలో రోడ్ల పరిస్థితిపై ప్రజానీకంలో అసహనం వ్యక్తం అవుతుంది. నిధుల సమస్యతో ప్రభుత్వం దెబ్బ తిన్న రోడ్లను తాత్కాలికంగా పూడ్చి కొంత మేర ప్రజలకు అనువుగా తీర్చిదిద్దుతోంది. పూర్తిగా పాడైన రోడ్లను కొత్తగా నిర్మిస్తోంది. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన పురపాలక పట్టణాభివృద్ధి శాఖ సమీక్షలో సీఎం జగన్ రోడ్ల పరిస్థితులపై అధికారులకు పలు సూచనలు చేశారు. నగరాలు, పట్టణాలతో పాటుగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు పరిస్థితి ,ఇబ్బందులు ప్రభుత్వానికి తెలియచేసేందుకు వీలుగా ప్రత్యేక యాప్ రూపకల్పన చేయాలని అధికారులకు సూచించారు. నగరాలు, పట్టణాల్లో కనీస మౌలిక సదుపాయాలపై నిరంతర పర్యవేక్షణ, సమస్యలపై సత్వర పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి తీసుకువచ్చేందుకు వీలుటుందని జగన్ అభిప్రాయపడ్డారు. దీర్ఘకాలంలో నిర్మాణాత్మక వ్యవస్థ ఏర్పాటుపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ఈమేరకు నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇందు కోసం ప్రత్యేక యాప్ రూపొందించే బాధ్యతను పట్టణాభివృద్ధి శాఖకు అప్పగించారు సీఎం జగన్.
‘‘ఏపీ సీఎం ఎంఎస్’’ (ఏపీ కన్‌సిస్టెంట్ మానిటరింగ్ ఆఫ్ మున్సిపల్ సర్వీసెస్) యాప్‌తో రియల్‌టైం మానిటరింగ్ చేసేందుకు వీలుగా రూపకల్పన ఉండాలన్నారు సీఎం జగన్. మరో నెల రోజుల్లో యాప్ ను సిద్ధం చేయాలన్నారు. రోడ్లపై గుంతలు, రోడ్లకు మరమ్మతులు మాత్రమే కాదు. పచ్చదనం, సుందరీకరణ, వీధిలైట్లు, నిర్వహణ, పుట్‌పాత్స్, మురుగు కాల్వల్లో పూడిక తొలగింపు, భూగర్భ మురుగునీటి వ్యవస్థల నిర్వహణ, పబ్లిక్ టాయ్‌లెట్ల ఏర్పాటు, వాటి నిర్వహణ, ట్రాఫిక్ జంక్షన్లు, వాటి నిర్వహణ అంశాల పై యాప్ ద్వారా రియల్ టైం మానిటరింగ్ చేసేందుకు అవసరం అయిన అన్ని చర్యలు ఉండాలన్నారు. రాష్ట్రంలోని 4,119 వార్డు సచివాలయాల పరిధిలో ఈ మౌలికసదుపాయాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరగాలన్న సీఎం, వార్డు సెక్రటరీలు తమ పరిధిలో ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి 12 గంటలవరకూ తనిఖీలు చేయాలన్నారు. తమ పరిధిలోని సుమారు 6–7 కి.మీ. మేర రోడ్ల పై నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. ఎక్కడైనా సమస్య ఉంటే వెంటనే ఫొటో తీసి యాప్ ద్వారా అప్‌లోడ్ చేయాలని గుర్తించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు పౌరులకూ ఫోటోలు అప్‌లోడ్ చేసే అవకాశం కల్పించాలని సూచించారు. కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కూడా తమ దృష్టికి వచ్చిన అంశాలను యాప్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుందని జగన్ అభిప్రాయపడ్డారు. ఎప్పటికప్పుడు ఈ సమస్యలు సంబంధిత విభాగాలకు.. అక్కడ నుంచి పరిష్కారాలు నివేదించిన ప్రతి సమస్య పరిష్కారంపై మానిటరింగ్ జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు.
సాంకేతికతను ఉపయోగించి సమస్యల పరిష్కారం
మున్సిపల్ సర్వీసుల కోసం నగరాలు, పట్టణాల్లో తీసుకువస్తున్న యాప్‌ను గ్రామాల్లో కూడా అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. నగరాల్లో, పట్టణాల్లో రోడ్లు, మురుగునీటి కాల్వలు సహా ఇతర మౌలిక సదుపాయాలు నిర్వహణ పూర్తిగా మెరుగుపడాలన్నారు. యాప్ ద్వారా వచ్చే గ్రీవెన్స్‌ను పరిష్కరించే వ్యవస్థ బలోపేతంగా ఉండాలన్న సీఎం, వర్షాకాలం సహా అన్ని కాలాల్లోనూ బాగుండేలా రోడ్ల నిర్మాణంలో కొత్త టెక్నాలజీ అంశం పై కూడా దృష్టిపెట్టాలని అదికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీర్ఘకాలం మన్నే పద్ధతిలో రోడ్ల నిర్మాణం ఉండాలన్నారు.