AP Secretariat System: గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు కొత్తగా చట్టం తీసుకొస్తూ.. ఏపీ ప్రభుత్వం సోమవారం ఆర్డినెన్స్ జారీ చేసింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే.. 2019 అక్టోబర్ రెండో తేదీ నుంచి రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. అప్పట్లో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ నూతన వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చారు. అయితే సోమవారం తాజా ఆర్డినెన్సుతో గ్రామాలు, పట్టమాల్లో ఇప్పటికే అముల్లో ఉన్న ఏపీ పంచాయతీరాజ్ చట్టం, ఏపీ మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ చట్టం తరహాలోనే సచివాలయ వ్యవస్థకు కూడా చట్ట రూపం వచ్చింది. రాజ్యాంగంలోని 11, 12 షెడ్యూళ్లలో పేర్కొన్న ప్రకారం ప్రజల కేంద్రంగా ప్రభుత్వ సేవలు, ఇతర సదుపాయాలను అందించేందుకు చట్టం ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల పేరుతో వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నట్లు ఆర్డినెన్స్ లో పేర్కొన్నారు. 


రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న పంచాయతీ రాజ్, మున్సిపల్ చట్టాలకు గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ చట్టం ఉంటుందని ఆర్డినెన్స్ లో పేర్కొన్నారు. ఈ ఆర్డినెన్స్ తో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అందజేసే ప్రభుత్వ సేవలు, ఈ శాఖ ద్వారా జారీ చేసే ఉత్తర్వులు శాసన అధికారంతో కూడినవిగా ఉంటాయని అందులో పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నియామకంతో వారి సర్వీస్ అంశాలు కూడా ఆర్డినెన్స్ లో నిబంధనలకు అనుగుణంగా చట్టబద్ధత కల్గి ఉంటాయని పేర్కొన్నారు. వచ్చే శాసన సభ సమావేశాల్లో ఈ ఆర్డినెన్స్ కు చట్ట సభల ఆమోదం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. 


రాష్ట్ర ముఖ్యమంత్రిగా  జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాలుగు నెలల్లోనే.. రికార్డుస్థాయిలో 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఇటీవలే అర్హులైన సచివాలయాల ఉద్యోగులకు ప్రొబేషన్‌ను కూడా ఖరారు చేసింది. ఇప్పుడు ఒకేసారి లక్షమందికిపైగా ఉద్యోగులను ఈహెచ్‌ఎస్‌ పరిధిలోకి తీసుకొస్తోంది. అర్హులైన సచివాలయాల ఉద్యోగులందరికీ ఆరోగ్యశ్రీ ట్రస్టు ఆధ్వర్యంలో ఈహెచ్‌ఎస్‌ కార్డుల జారీకి గ్రామ, వార్డు సచివాలయశాఖ చర్యలు చేపట్టింది.


2019లో గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం 1 లక్షా 35వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. వాటిలో 1.21 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసింది. రెండేళ్ల ప్రొబేషన్ పీరియడ్ రూ.15వేల స్టైఫండ్ ఇచ్చిన ప్రభుత్వం... గతేడాది నవంబర్ లో ప్రొబేషన్ ఖరారు కోసం పరీక్షలు నిర్వహించింది. పోస్టుల వారీగా ప్రభుత్వం ఖరారు చేసిన పే స్కేల్ వివరాలు చూస్తే.. పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-5కి 23,120-74,770గా ఖరారు చేశారు. మిగిలిన పోస్టులకు రూ.22,460-72,810గా ఫిక్స్ చేశారు. అలాగే వార్డ్ అడ్మిన్ సెక్రటరీకి రూ. 23,120-74,770గా పేర్కొంది. ఇందులో బేసిక్ పేకి హెచ్ఆర్ఏ, డీఏలు అదనంగా రానున్నాయి. సచివాలయాల ద్వారా దాదాపు 5 కోట్ల మంది ప్రజలు ఊరు దాటకుండానే సేవలు పొందుతున్నారు.