Vallabhaneni Vamsi: వంశీ బెయిల్‌పై సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం - వదిలి పెట్టకూడదని ప్రయత్నం
Vamsi: వల్లభనేని వంశీకి వెకేషన్ కోర్టు ఇచ్చిన బెయిల్ పై సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. మట్టి అక్రమ తవ్వకాలతో రూ.195 కోట్లు నష్టం జరిగిందని విజిలెన్స్ అధికారులు గుర్తించారు.

Vallabhaneni Vamsi No Bail: వైసీపీ నేత వల్లభనేని వంశీకి మట్టి అక్రమ తవ్వకాలకేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఇచ్చిన బెయిల్‌పై సుప్రీంకోర్ట్‌కు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్ట్‌లో ఉన్న అడ్వకేట్ ఆన్ రికార్డ్స్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2019 నుంచి 2024 వరకు గన్నవరం నియోజకవర్గంలో జరిగిన మట్టి అక్రమ తవ్వకాలపై విజిలెన్స్ దర్యాప్తు చేసింది. ప్రభుత్వానికి రూ.195 కోట్లు నష్టం జరిగిందని విజిలెన్స్ అధికారులు నిర్దారదించారు. నివేదిక మేరకు ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఏసీబీ నమోదు చేసిన ఈ కేసులో పీటీ వారెంట్ అమలు చేస్తున్నారని హైకోర్ట్‌ను వంశీ ఆశ్రయించారు. వేకేషన్ కోర్ట్‌లో వంశీకి హైకోర్ట్ బెయిల్ ఇచ్చింది. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఇంతటి భారీ నష్టం కలిగిన కేసులో హైకోర్ట్ బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వెంటనే చర్యలు చేపట్టాలని ప్రభుత్వం అడ్వకేట్ ఆన్ రికార్డ్స్‌కు ఆదేశాలు ఇస్తూ హోమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జీవో జారీ చేశారు. హైకోర్ట్ వంశీకి ఇచ్చిన బెయిల్‌ని రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్ట్‌లో సోమవారం స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేయనుంది.
ఇవీ ఆరోపణలు
వెదురుపావులూరు, కొండపావులూరులో 300 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న కొండ ప్రాంతాన్ని భారీ పేలుళ్లతో పిండి చేసినట్లుగా అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. సూరంపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 526లోని 500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న తోకతిప్పను కూడాతవ్వేశారని గ్రామస్తులు అనేక సార్లు ఫిర్యాదులు చేశారు. మల్లవల్లిలోని సర్వే నెంబర్ 11లో 175 ఎకరాల్లో గ్రానైట్ ను పోర్టు పనుల పేరుతో తవ్వుకున్నారు. గన్నవరం మండలం పరిధిలోనే ముస్తాబాద, చనుపల్లివారిగూడెం కొండలను కూడా అనధికారికంగా మైనింగ్ చేశారని అధికారులు గుర్తింంచారు. అన్నీ వంశీ వెనుకుండి చేయించారని భావిస్తున్నారు. మట్టి తవ్వకంపైనా ఆరోపణలు ఉన్నాయి. నాలుగు మండలాల పరిధిలో 80 శాతానికి పైగా చెరువులను ఎలాంటి అనుమతులు లేకుండా అడ్డగోలుగా తవ్వారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఫిబ్రవరి 13 నుంచి జైల్లోనే వంశీ
గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఫిర్యాదు దారుడు అయిన సత్యవర్థన్ ను కిడ్నాప్ చేసి బెదిరించి.. కేసును ఉపసంహరించకునేలా చేశారన్న కేసులో అరెస్టు చేశారు. ఆ తర్వాత పాత కేసులన్నీ వరుసగా ఆయనపై బయటకు వచ్చాయి. పీటీ వారెంట్లు జారీ చేసి అరెస్టు చేశారు. ఆయనపై నమోదైన కేసుల్లో నకిలీ పట్టాలపై కేసులో మాత్రమే జైల్లో ఉన్నారు. అన్ని కేసుల్లో బెయిల్ వచ్చింది. పీటీ వారెంట్ అమలు చేయక ముందే .. మట్టి తవ్వకాల కేసులో హైకోర్టులో బెయిల్ వచ్చింది. అందుకే ఈ అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పీటీ వారెంట్ అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తే. మరికొంత కాలం జైల్లో ఉండి.. ఆ కేసులోనూ ఆయన బెయిల్ తెచ్చుకోవాల్సి ఉంటుంది.





















