New Law to Curb Fake News: ఏఐ ఫోటోలు, వీడియోలు, ఫేక్ న్యూస్ తో ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడం ఎక్కువైపోయిందని ఏపీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఫేక్ న్యూస్ కట్టడికి ప్రత్యేక చట్టం తీసుకు రావాలని నిర్ణయించింది.  ముఖ్యంగా  సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టుల నివారణకు సీఎం  మంత్రి వర్గ సమావేశంలో చర్చించారు.  తప్పుడు పోస్టుల నివారణకు తీసుకురావాల్సిన విధివిధానాలపై చర్చించారు.  మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.  మంత్రులు అనిత, నాదెండ్ల, అనగాని, పార్థసారధితో ఉపసంఘం ఏర్పాటు చేశాఱు. కొత్త చట్టం తీసుకొచ్చేందుకు నిబంధనలను రూపొందించనున్నారు.  తప్పుడు పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు ఉండేలా చట్టం ఉండాలని సీఎం చంద్రబాబు ఉపసంఘ సభ్యులకు సూచించారు. 

సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న తప్పుడు పోస్టులు ,  మిస్ ఇన్ఫర్మేషన్‌ను నిరోధించకపోతే  అనేక సమస్యలు వస్తాయని మంత్రులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటంతో పాటు ప్రజలను తప్పుదారి పట్టించకుండా చేయడమే లక్ష్యంగా కొత్త చట్టం తేవాలని నిర్ణయించారు.  ఇటీవల వైఎస్ఆర్‌సీపీ వంటి విపక్ష పార్టీలు సామాజిక మాధ్యమాల ద్వారా ఫేక్ ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని ఆరోపణలు ఉండటంతో, ప్రభుత్వం ఈ సమస్యపై తీవ్రంగా స్పందించింది. 

 సమావేశంలో సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారాన్ని నిరోధించేందుకు తీసుకోవాల్సిన విధివిధానాలపై విస్తృతంగా చర్చ జరిగింది. ఫేక్ న్యూస్ ,డెరోగేటరీ పోస్టులు ప్రజలలో అభద్రతా భావాన్ని సృష్టిస్తున్నాయని, ముఖ్యంగా మహిళలు ,  రాజకీయ నాయకులపై దాడులు పెరుగుతున్నాయని  హోంమంత్రి అనిత్ పేర్కొన్నారు. ఇటువంటి పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చారని, ఇది రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడటానికి అవసరమని ఆమె తెలిపారు. ఇటీవల ఎరువుల కొరతపై వైఎస్ఆర్‌సీపీ ఫేక్ క్యాంపెయిన్ చేస్తోందని సీఎం ఖండించారు, ఇటువంటి ఫేక్ ప్రచారానికి కఠిన శిక్షలు విధిస్తామని  హెచ్చరించారు.

ఫేక్ పోస్టులు, ఫేక్ న్యూస్‌లు వైరల్ చేస్తే  సెడిషన్ చార్జెస్ వంటి కఠిన శిక్షలు ఉండవచ్చని హోమ్ మంత్రి అనిత హెచ్చరించారు. రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాలు, అమరావతి అభివృద్ధి, ఎరువుల సరఫరా వంటి అంశాలపై వైఎస్ఆర్‌సీపీ ఫేక్ ప్రచారం చేస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. మొత్తంగా సోషల్ మీడియాలో రాజకీయ పార్టీలు నిర్వహించే సైన్యమే ఫేక్ పోస్టులు పెడుతోంది. వాటికి కంట్రోల్ చేయగలిగే చట్టం చేయగలరా అన్నది సందేహమే.