ఏపీ ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు, ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, కార్మిక సంఘాల జేఏసీ ఛైర్మన్ నలమారు చంద్రశేఖర్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం... ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. రెండు సంవత్సరాల పదవీ కాలంతో ప్రభుత్వ సలహాదారుగా (ఉద్యోగుల సంక్షేమం) నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నలమారు చంద్రశేఖర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుగా ఇవాళ్టి నుంచి రెండు సంవత్సరాల పాటు కొనసాగుతారు. ఆయన 36 సంవత్సరాల పాటు ఉద్యోగ సంఘ నాయకుడిగా పనిచేసిన అనుభవం ఉంది. ఉద్యోగుల సంఘం నాయకుడిగా అందించిన సేవలు, అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆయనను సలహాదారుగా నియమించింది. 


Also Read: ఏపీలో తొలిసారిగా వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు ప్రదానం.. ఇకనుంచి ప్రతి ఏడాది: వైఎస్ జగన్


ఉద్యోగులు, ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తా


ఉద్యోగుల విషయంలో ప్రభుత్వానికి తగిన సలహాలు అందించడానికి చంద్రశేఖర్ రెడ్డిని ప్రభుత్వం సలహాదారుగా నియమించింది. సమైక్య ఆంధ్ర ఉద్యమ సమయంలో ఆయన కీలక పాత్ర వహించారు. ఆయన జైళ్ల శాఖలో సూపరింటెండెంట్ గా పనిచేశారు. ఈ ఏడాది జూన్ 30న పదవీ విరమణ పొందారు. ఆయన కడప జిల్లాలో పుట్టి ఉద్యోగ రీత్యా హైదరాబాద్ వచ్చారు. అక్కడ నుంచి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయన అమరావతికి వచ్చారు. చంద్రశేఖర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుగా నియామకం వల్ల ఉద్యోగులకు, ప్రభుత్వానికి వారధిగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయన సుదీర్ఘకాలం ఉద్యోగ నాయకుడిగా ఉండటంతో వారి సమస్యలపై పూర్తి అవగాహన ఉంటుందంటున్నారు. 


Also Read: ఓ కార్పొరేషన్ -12 మున్సిపాలిటీల్లో ఎన్నికలు ! ఏపీలో మినీ స్థానిక సమరానికి షెడ్యూల్ రిలీజ్ !


ప్రభుత్వం దృష్టికి ఉద్యోగుల సమస్యలు తీసుకెళ్తా


నలమారు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్ తనపై ఉంచిన నమ్మకానికి తగినట్లుగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల, కార్మికుల సమస్యల పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు. ఉద్యోగులకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటానన్నారు. సీఎం జగన్ ఆశయాన్ని నెరవేర్చేందుకు కృషి చేస్తానన్నారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. తనను ఈ పదవిలో నియమించినందుకు సీఎం జగన్, సజ్జల రామకృష్ణ రెడ్డి, ఉద్యోగ సంఘ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. 


Also Read:  మాకు డెడ్ లైన్‌ పెట్టడానికి నువ్వెవడివి ? పవన్‌పై మంత్రి అప్పలరాజు ఫైర్ !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి