AP News :  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు తాము రుణాలు తీసుకున్న బ్యాంక్ మేనేజర్లను కలిసి తమపై పెనాల్టీలు వేయవద్దని కోరుతున్నారు. తమకు జీతాలు ఆలస్యం అవుతున్నాయని అందుకే ఈఎంఐలు సమయానికి కట్టలేకపోతున్నామని చెబుతున్నారు.  ఏపీ జేఏసీ అమరావతి మలిదశ ఉద్యమ కార్యాచరణలో భాగంగా  ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు ప్రతీ నెలా ఆలస్యంగా ఇస్తున్నందుకు నిరసనగా బ్యాంకర్లను కలిసి చెల్లింపులపై ఒత్తిడి చేయవద్దని, పెనాల్టిలను వేయవద్దని కోరుతూ ప్రధాన బ్యాంకుల సందర్శన కార్యక్రమం నిర్వహించారు.                                                   


రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నెల ఒకటో తేదీ జీతం రాకపోవడంతో బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న ఉద్యోగులను డిఫాల్ట్ లిస్టులో పెట్టడంతో వారికి భవిష్యత్తులో తిరిగి రుణాలు తీసుకునే అవకాశం కోల్పోతున్నారని  ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.   ప్రభుత్వ ఉద్యోగులకు నెలలో జీతం ఏ రోజు వస్తుందో తెలియని గందరగోళ పరిస్థితుల్లో ఉన్నామని ... బ్యాంకు మేనేజర్లు ప్రభుత్వ ఉద్యోగులపై దయఉంచి వారు తీసుకున్న రుణాలకు ఈఎంఐలు కట్ చేయకూడదని బ్యాంకు మేనేజర్లకు వినతిపత్రాలు అందించామని చెబుతున్నారు.                            


తమది ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమం కాదని, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చేస్తున్నదని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.  సకాలంలో జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని   టైంకి జీతాలు అందకపోతే ఉద్యోగుల కుటుంబాలు ఆందోళనలో కూరుకుపోతాయని ఉద్యోగులు ఆందోళన వెలిబుచ్చుతున్నారు.  ఈఎమ్ఐలు చెల్లించని కారణంగా బ్యాంకులు వడ్డీలు వేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు రాక ఉద్యోగులు లోన్ యాప్స్‌లో రుణాలు తీసుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఉద్యోగ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  జీతాలు పెరిగితే సంతోషించాల్సిన స్థితి నుంచి జీతాలు అందితే చాలు అన్న స్థితికి ఉద్యోగులను తెచ్చారని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఎందుకు అన్యాయం చేస్తున్నారని ముఖ్యమంత్రిని ఉద్యోగ నేతలు ప్రశ్నిస్తున్నారు.  


జీతాలు ఒకటో తేదీన  ఇవ్వాలని కోరినా మంత్రుల కమిటీ స్పందించలేదని, సీపీయస్ ఉద్యోగుల రూ. 1300 కోట్ల రూపాయల డబ్బులను ఇవ్వాల్సి ఉందని ఏపీ జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు చెబుతున్నారు.  ఏప్రిల్ నుంచి జీపీఎస్ కు సంబంధించిన ఉద్యోగులకు సమాచారం రావడం లేదని, ప్రభుత్వం నెలాఖరులోగా ఇస్తామని చెప్పినా ఉద్యోగులకు నమ్మకం లేకుండాపోయిందని అన్నారు.సిపిఎస్ రద్దు అంటుంటే జిపిఎస్ అంటున్నారని, పాత పెన్షన్ తప్ప ఇతర ఏది తీసుకువచ్చిన మేము అంగీకరించేది లేదని తెగేసి చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేస్తామని, హామీ ఇచ్చారని, అయితే ఆ హామీని అమలు చేయాలని అడుగుతుంటే స్పందన లేకుండాపోయిందని బొప్పరాజు మండిపడ్డారు.