Duddukunta Sridhar Reddy Gets Puttaparthi YSRCP Ticket: పుట్టపర్తి వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ నియోజకవర్గంలో అసమ్మతినేతలు సమావేశమయ్యారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెండు రోజుల కిందట అభ్యర్థుల జాబితా ప్రకటించడం తెలిసిందే. పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి మరోసారి వైసీపీ టికెట్ ఇవ్వడంతో గతంలో ఆయన ఆఫీసులో పనిచేసిన సజ్జల మహేశ్వర్ రెడ్డి వినూత్నంగా నిరసన తెలిపాడు. శ్రీధర్ రెడ్డికి వైసీపీ అధిష్టానం టికెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ అరగుండు, అరమీసం చేయించుకుని నిరసన తెలిపాడు. శ్రీధర్ రెడ్డికి టికెట్ ఇస్తే కచ్చితంగా ఓడిపోతారని గతంలో కూడా చెప్పినట్లు సజ్జల మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నాడు. 


పుట్టపర్తిలో వైసీపీని వీడని వర్గ విభేదాలు 
ఈ తతంగం మరువక ముందే దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినా పుట్టపర్తిలో వైసీపీని విబేధాలు వీడడం లేదు. ఎమ్మెల్యే దుద్దేకుంట శ్రీధర్ రెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ పుట్టపర్తిలో అసమ్మతి నాయకులు పుట్టపర్తి మాజీ సమన్వయకర్త కొత్తకోట సోమశేఖర్ రెడ్డి (Somasekhara Reddy), ఎంపీటీసీ ఇంద్రజిత్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లోచర్ల విజయ్ భాస్కర్ రెడ్డి తమ అనుచరులతో కలిసి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో గత నాలుగు సంవత్సరాలుగా సమస్యలు తీష్ట వేసిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పట్టించుకోలేదని ఆరోపించారు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై పలుసార్లు వైసీపీ అధిష్టానానికి తాము వివరించామని వారు తెలిపారు. ఎమ్మెల్యే దిద్దేగుంట శ్రీధర్ రెడ్డి కారణంగా నియోజకవర్గంలో వైసిపి పార్టీ నేతలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అధిష్టానంతో పాటు పార్టీలోని ముఖ్య నేతలు కూడా చెప్పినట్లు పేర్కొన్నారు. 


ఈ ఎన్నికల్లో పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీధర్ రెడ్డికి అవకాశం కల్పిస్తే తాము పార్టీని వీడేందుకు కూడా వెనకాడబోమని గతంలోనే హెచ్చరించామని గుర్తుచేశారు. అయినప్పటికీ కూడా శ్రీధర్ రెడ్డికే వైసీపీ అధిష్టానం టికెట్ కేటాయించడం తమను నిరాశకు గురి చేసిందన్నారు. నియోజకవర్గంలో వైసీపీ కోసం పనిచేస్తున్న మమ్మల్ని సంప్రదించకుండా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి వైఎస్ జగన్ టికెట్ ఖరారు చేయటం బాధాకరమన్నారు. శ్రీధర్ రెడ్డికి మరోసారి టికెట్ ఇస్తే ఓడిపోతారని, ఈ విషయాన్ని గతంలోనూ వైసిపి అధిష్టానానికి చెప్పాం.. ఇప్పుడు కూడా అదే చెబుతున్నామన్నారు. పుట్టపర్తిలో అభ్యర్థిని మార్చాలని వారు డిమాండ్ చేశారు. ఇదే విషయమై మరోసారి అధిష్టానం దృష్టికి తీసుకొస్తామని చెప్పారు. అధిష్టానం నిర్ణయం తరువాత భవిష్యత్ కార్యాచరణ ఉమ్మడిగా ప్రకటిస్తామని స్పష్టం చేశారు.


పుట్టపర్తి టికెట్ ఆశించిన సోమశేఖర్ రెడ్డి 
పుట్టపర్తి నియోజకవర్గం మాజీ సమన్వయకర్త సోమశేఖర్ రెడ్డి పుట్టపర్తి వైసీపీ టికెట్ ఆశించారు. సీఎం జగన్ ఉమ్మడి అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు కూడా స్వాగతం పలికేందుకు వెళ్లిన సోమశేఖర్ రెడ్డి పార్టీ అధినేతకు ఇదే విషయాన్ని వెల్లడించారు. గతంలో తనకు అవకాశం కల్పిస్తామని మీరు మాట ఇచ్చారు. ఈ ఎన్నికల్లో తప్పకుండా  పుట్టపర్తి నియోజకవర్గం నుంచి అవకాశం ఇవ్వాలని కోరారు. 2019 ఎన్నికల్లో శ్రీధర్ రెడ్డికి సపోర్ట్ చేయాలని జగన్మోహన్ రెడ్డి సూచించినందుకే సపోర్ట్ చేశానని సోమశేఖర్ రెడ్డి గుర్తు చేశారు. 
ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీధర్ రెడ్డి ఒంటెద్దు పోకడతో నియోజకవర్గంలో పార్టీలో చీలికలు వచ్చాయన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా సమస్యలను సృష్టించి తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. పుట్టపర్తి ఎమ్మెల్యేపై నియోజకవర్గంలో వైసీపీ నేతలు అసంతృప్తిగా ఉన్నారని, ఈసారి తనకు అవకాశం కల్పించాలని సోమశేఖర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సోమశేఖర్ రెడ్డి వినతిని పక్కనపెట్టిన వైఎస్ జగన్ మరోసారి పుట్టపర్తి సీటును శ్రీధర్ రెడ్డికి ఇచ్చారు. దీంతో పుట్టపర్తి నియోజకవర్గం వైసీపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. శ్రీధర్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న నియోజకవర్గ నేతలు, శ్రేణులు అధిష్టానంని కలిసి తనకు ఛాన్స్ ఇవ్వాలని కోరతామని సోమశేఖర్ రెడ్డి వర్గీయులు తెలిపారు.