AP Elections Latest News: ఈనెల 13న జరిగే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఆ మరుసటి రోజు అంటే మే 14వ తేదీ మంగళవారం ప్రత్యేక క్యాజువల్ లీవ్ (ఆన్ డ్యూటీ) సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా తెలియజేశారు. ఈ మేరకు సంబంధిత లీవ్ శాంక్సనింగ్ అథారిటీలు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. 13న ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఆ మరుసటి రోజు 14న ప్రత్యేక క్యాజువల్ లీవ్ (ఆన్ డ్యూటి)గా పరిగణించాలని ఏపీఎన్జీవో, ఏపీ జేఏసీ ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఈవో స్పష్టం చేశారు.
పోలింగ్ విధులు నిర్వహించే ప్రిసైడింగ్ అధికారులు (పీఓ), అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు(ఏపీఓ) ఇతర పోలింగ్ సిబ్బంది (ఓపీఓ)కి 14న ఈ ప్రత్యేక క్యాజువల్ లీవ్(ఆన్ డ్యూటి) వర్తిస్తుందని తెలిపారు. కాగా పోలింగ్ విధులకై రిజర్వుడు సిబ్బందిగా ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బందిగా డ్రాప్టు చేసిన వారికి ఈ ప్రత్యేక క్యాజువల్ లీవ్ వర్తించదని సీఈవో ముఖేశ్ కుమార్ మీనా స్పష్టం చేశారు. వాస్తవంగా ఎవరైతే పోలింగ్ విధులు నిర్వహిస్తారో వారికి మాత్రమే ఈ ప్రత్యేక క్యాజువల్ లీవ్ వర్తిస్తుందని సీఈవో స్పష్టం చేశారు.
కావున అందరు జిల్లా ఎన్నికల అధికారులు ఈ ఆదేశాలను రిటర్నింగ్ అధికారులందరికీ తెలియజేసి 13న పోలింగ్ అనంతరం రిసెప్షన్ కేంద్రంలో పోలింగ్ సామగ్రిని అప్పగించిన తర్వాత పీఓ, ఏపీఓ, ఓపీఓలకు డ్యూటీ సర్టిఫికెట్లను జారీ చేసి 14న ఈ ప్రత్యేక క్యాజువల్ లీవ్ (ఆన్ డ్యూటీ) సౌకర్యాన్ని వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సీఈవో మీనా ఆదేశించారు. అలాగే అందరు కార్యదర్శులు, శాఖాధిపతులు, జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లు సంబంధిత లీవ్ శాంక్సనింగ్ అథారిటీలకు ఈ ఆదేశాలను సర్క్యులేట్ చేసి పోలింగ్ విధులు నిర్వహించిన వారికి 14న ప్రత్యేక క్యాజువల్ లీవ్(ఆన్ డ్యూటి)గా పరిగణించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా తెలియజేశారు.