Pawan Kalyan Responds On Supreme Court Verdict On Tirumala Laddu Issue: తిరుమల లడ్డూ వ్యవహారానికి సంబంధించి విచారణ కోసం స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పును డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) స్వాగతించారు. స్వతంత్ర దర్యాప్తు బృందం ద్వారా అసలు నిజం వెలుగులోకి వస్తుందని అన్నారు. కల్తీ నెయ్యి వినియోగంపై సతాతన ధర్మాన్ని విశ్వసించే వారంతా ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. 'గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుల హయాంలోనే ప్రసాదాలు, అన్నప్రసాదంలో నాణ్యత లోపించింది. గత పాలక మండళ్లు తీసుకున్న నిర్ణయాలను పరిగణనలోకి తీసుకుని.. వాటిలో సంస్కరణలు తీసుకొచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. అపవిత్ర చర్యలు, తప్పుడు నిర్ణయాలకు కారకులైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.' అని తెలిపారు. అటు, సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ సైతం సర్వోన్నత న్యాయస్థానం తీర్పును స్వాగతిస్తూ ట్వీట్ చేశారు.
స్వతంత్ర సిట్ ఏర్పాటు
కాగా, తిరుమల లడ్డూ వ్యవహారానికి సంబంధించి వేర్వేరు పిటిషన్లను శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానం మరోసారి విచారించింది. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం ఈ అంశంపై స్వంతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది. ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారించాలని సూచించింది. ప్రస్తుతం వేసిన సిట్ నుంచి ఇద్దరు, సీబీఐ నుంచి ఇద్దరు, ఎఫ్ఎస్ఎస్ఐఏ నుంచి మరొకరు ఈ బృందంలో సభ్యులుగా ఉంటారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఈ దర్యాప్తు సంస్థకు నాయకత్వం వహించబోతున్నారు. మొత్తం దర్యాప్తును సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పర్యవేక్షించబోతున్నారు. జస్టిస్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్ బెంచ్ ఈ తీర్పు వెలువరించింది.