Dharmana Krishna Das: ఏపీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశంసించారు. చంద్రబాబు విజ్ఞత కలిగిన ముఖ్యమంత్రి అంటూ వ్యాఖ్యలు చేశారు. పద్నాలుగు ఏళ్ల పాటు ఆయన ఈ రాష్ట్రాన్ని విజ్ఞతతో పరిపాలించారని అన్నారు. చంద్రబాబు ప్రస్తుతం ప్రతిపక్షంగా ఉన్నందున తమ ప్రభుత్వానికి సలహాలు ఇచ్చి సహకరించాలని కోరారు. కొత్త జిల్లాలపై శ్రీకాకుళం జిల్లాలో సోమవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన, స్పీకర్ తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రతిపక్ష నాయకులు చేస్తున్న విమర్శల గురించి ధర్మాన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.


విద్యుత్ చార్జీల పెంపుపై ధర్మాన మాట్లాడుతూ.. కరెంటు రేట్లు నామినల్‌గా పెంచితే టీడీపీ నాయకులు దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారని అన్నారు. వారు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. కనీసం వారు అసెంబ్లీకి హాజరు కాకుండా వచ్చిన కాసేపు కూడా చిడతలు వాయించుకుంటూ కూర్చుంటున్నారని ఎద్దేవా చేశారు. ‘‘ప్రతిపక్షం పాలక పక్షం ఒక బండికి రెండు చక్రాల్లాటివి. ఆ రెండిట్లో ఒక చక్రం లేకపోయినా బండి సాఫీగా నడవదు. నో డౌట్ చంద్రబాబు గారు విజ్ఞత కలిగిన ముఖ్యమంత్రి నేనేం కాదనట్లేదు. 14 ఏళ్లు ఆ ఆరోజులకు తగ్గట్లుగా ఆయన పాలించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మకమైన పరిపాలన చేస్తుంటే దాన్ని అభినందించలేకపోతున్నారు. ప్రతిపక్షాలు ఇలా ఆలోచన లేని మాటలు మాట్లాడి ప్రజల ముందు చులకన అవుతున్నారు. మూడేళ్ల నుంచి బ్రహ్మాండమైన ఫలితాలను ప్రజలు ఇస్తున్నారు. జగన్ గారి పాలన ప్రజలకు మేలు చేకూర్చేది.’’ అంటూ మాట్లాడారు.


ఉప ముఖ్యమంత్రి ధర్మాన కాస్త చర్చనీయాంశ రీతిలో వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో కూడా విజయం సాధించి రెండోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని, ఒకవేళ ఓడిపోతే తన ఆస్తి మొత్తం రాసిచ్చేస్తానంటూ సవాలు విసిరారు. గత మార్చిలో 19వ తేదీన శ్రీకాకుళం జిల్లా పోలాకి, చెల్లాయి వలసలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కాకపోతే తన ఆస్తులన్నీ తెలుగు దేశం పార్టీకి రాసిచ్చేస్తానని సవాల్ విసిరారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన నభూతో న భవిష్యతి అని అభివర్ణించారు.


నాలుగు సార్లు ఎమ్మెల్యేగా
2019 ఎన్నికల్లో ధర్మాన కృష్ణదాస్ నాలుగోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన ఈయన వైసీపీ స్థాపించినప్పుడు సీఎం జగన్ వెనక్కి వచ్చారు. ఆ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో తన సోదరుడు ధర్మాన ప్రసాదరావు మంత్రిగా ఉన్నా కూడా కృష్ణదాస్ మాత్రం కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిపోయారు. ఈ క్రమంలోనే 2012లో జరిగిన ఉప ఎన్నికలో వైసీపీ తరఫున ధర్మాన కృష్ణదాస్ పోటీ చేసి గెలుపొందారు. అనంతరం 2014 ఎన్నికల్లో ధర్మాన సోదరులిద్దరూ ఓడిపోయారు. 2019లో ధర్మాన సోదరులిద్దరూ వైసీపీ నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలుపొందారు.


ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తన మంత్రివర్గంలో సీఎం జగన్ ధర్మానకు పెద్ద పీట వేశారు. ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. త్వరలోనే మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించనున్నట్లు సీఎం జగన్ ప్రకటించిన వేళ ధర్మాన కృష్ణదాస్‌ తన పదవి కోల్పోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.