AP Farmers Scheme | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమం కోసం అవసరమైన ఓ పథకాన్ని ప్రారంభించింది. పశువుల ఆరోగ్య సంరక్షణకు ఉచితంగా టీకాలు, మందులు మాత్రమే కాకుండా, పశుగ్రాసం కోసం విత్తనాలు, పశువుల దాణాపై భారీగా రాయితీలు అందిస్తోంది. ఈ పథకం ద్వారా పాడి రైతులకు ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉంది.

Continues below advertisement


పశుగ్రాస విత్తనాలపై 75 శాతం సబ్సిడీ
పశుగ్రాసం విత్తనాలపై ఏపీ ప్రభుత్వం 75 శాతం సబ్సిడీ అందిస్తోంది. హైబ్రీడ్ జొన్న, మొక్కజొన్న విత్తనాలను తక్కువ ధరకు రైతులకు అందించనుంది. ఉదాహరణకు, జొన్న విత్తనాల 5 కిలోల ప్యాకెట్ ధర రూ.460 కాగా, రైతులు చెల్లించాల్సిన వాటా కేవలం రూ.115 మాత్రమే. అలాగే, మొక్కజొన్న విత్తనాల 5 కిలోల ప్యాకెట్ ధర రూ.340 కాగా, రైతు చెల్లించాల్సింది రూ.85 మాత్రమే. ప్రతి రైతు కనీసం 5 కేజీల నుంచి గరిష్టంగా 20 కేజీల వరకు విత్తనాలు పొందవచ్చు.


పశువుల దాణాపై 50 శాతం రాయితీ
పశువుల దాణా విషయానికి వస్తే, సమీకృత దాణాపై 50 శాతం రాయితీ ఇవ్వనున్నారు. దాణా బస్తా ధర రూ.1,110 కాగా, రైతులు సగం ధర అంటే రూ.555 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి రైతు 1 క్వింటా నుంచి 1.5 క్వింటాళ్ల వరకు దాణా పొందవచ్చు. ఇది పశువుల పోషణను మెరుగుపరచడంలో రైతులకు ఎంతో సహాయపడుతుంది.


రైతులు ఎలా పొందాలి? కావాల్సిన పత్రాలు ఇవే
ఈ రాయితీలను పొందడానికి రైతులు తమ సమీపంలోని రైతు సేవా కేంద్రం (RBK)ను సంప్రదించాలి. వారికి అవసరమైన పత్రాలు ఏంటంటే.. పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు ఫొటోకాపీలు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అర్హత కలిగిన రైతులు ఈ పథకాన్ని వినియోగించుకోవచ్చు.


సర్వే చేపట్టిన ప్రభుత్వం
ఇక రైతుల అవసరాలను అంచనా వేసేందుకు పశుసంవర్ధక శాఖ ఈ నెల 15వ తేదీ వరకు ఏపీ వ్యాప్తంగా సర్వే నిర్వహిస్తోంది. AHAs మరియు పారా సిబ్బంది ఈ సర్వేలో పాల్గొంటున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం పాడి రైతులకు ఆర్థికంగా పెద్ద ఊరట కలిగించనుంది. కనుక రైతులు ఆలస్యం చేయకుండా తమ సమీప RBKను సంప్రదించి రాయితీపై విత్తనాలు, దాణా పొందాలని అధికారులు సూచించారు.



రైతుల కొత్త స్కీమ్ ముఖ్యాంశాలు
పశుగ్రాస విత్తనాలపై రైతులకు 75% రాయితీ
సమీకృత దాణాపై రైతులకు 50% సబ్సిడీ
ఉచిత టీకాలు, ఆరోగ్య పరీక్షలు చేస్తారు
ఈ నెల 15 వరకు ఏపీ వ్యాప్తంగా సర్వే చేయనున్న అధికారులు