Andhra Pradesh CM YS Jagan slams chandrababu over Pensions issue: పూతలపట్టు: వైసీపీ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ స్టార్ క్యాంపెయినర్లుగా మారి, సర్కార్ చేసిన మంచిని మరో 100 మందికి చెప్పాలన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. తాను 130 సార్లు బటన్ నొక్కి రాష్ట్ర ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించానని, లబ్ధి పొందిన వారు ఎన్నికల్లో రెండు బటన్లు ఫ్యాన్‌ మీద నొక్కాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు అనే చంద్రముఖిని పెట్టెలో బిగించి మళ్లీ లకలక అంటూ మన రక్తం తాగేందుకు రాకుండా జాగ్రత్తపడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. వైఎస్ జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ (Memantha Siddham Bus Yatra) బస్సు యాత్ర 7వ రోజుకు చేరుకుంది. చిత్తూరు జిల్లా పూతలపట్టు బైపాస్‌లో బుధవారం సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ఇది పేదలకు, పెత్తందార్లకు మధ్య జరుగుతున్న ఎన్నికల యుద్ధమని వ్యాఖ్యానించారు. 




జగన్ కొత్త నినాదం వైనాట్ 200 
నిన్న మొన్నటివరకూ వైనాట్ 175 అన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇప్పుడు కొత్త నినాదం ఎత్తుకున్నారు. వైనాట్ 200 అంటూ వైసీపీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపారు. అసెంబ్లీ ఎన్నికల్లో 175కి 175 సీట్లతో పాటు రాష్ట్రంలోని మొత్తం 25 ఎంపీ స్థానాల్లో వైసీపీ విజయం సాధించాలని ఆకాంక్షించారు. జగన్ ఒక్కడు ఒకవైపు ఉంటే, తోడేళ్లు గుంపుగా మన మీద దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని, రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. విశ్వసనీయత, విలువలతో కూడిన రాజకీయం ఒకవైపు ఉంటే.. మోసం, అన్యాయం, కుట్రలు మరోవైపు ఉన్నాయి. ప్రత్యేక హోదా సాధించని పార్టీ, ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీతో చేతులు కలిపిందని టీడీపీపై విమర్శలు గుప్పించారు.


‘దేశంలో రూ.3వేల పింఛన్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే. అవ్వాతాతలు, పేదలు, అక్కాచెల్లెమ్మలను రక్షించుకునేందుకు మీరు సిద్ధా. మొత్తం 130 సార్లు బటన్ నొక్కి ఏకంగా రూ.2 లక్షల 70 వేల కోట్లు నేరుగా పేదల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశాం. వాళ్లు అధికారంలోకి వస్తే ఇంటి వద్ద పింఛన్ ఇవ్వరు. అవ్వాతాతలను ఇబ్బంది పెడతారు. సంక్షేమ పథకాలు తొలగిస్తారు. చంద్రబాబు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చని నేత. 2014లో రైతు రుణమాఫి చేస్తా అన్నాడు.. అయ్యిందా. డ్వాక్రా రుణమాఫి అని చెప్పి మోసం చేశాడు. ఇంటింటికి ఓ ఉద్యోగం, నిరుద్యోగ భృతి అని చెప్పి ఏ హామీని నెరవేర్చలేదు. సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు పేరు చెబితే ప్రజలకు ఒక్క స్కీమ్‌ కూడా గుర్తురాదు. మే 13న జరగబోయే ఎన్నికల్లో సంక్షేమ ప్రభుత్వానికి అండగా నిలవాలి. ఒక్క ఓటుపై ఐదేళ్ల భవిష్యత్‌ ఆధారపడి ఉంది.’ అని సీఎం జగన్‌ అన్నారు.






సూర్యుడు ఉదయించముందే ఒకటో తేదీన వాలంటీర్లు మీ ఇంటికి వచ్చి అవ్వాతాతలకు, లబ్ధిదారులకు పింఛన్ ఇచ్చేవాళ్లు అని జగన్ గుర్తుచేశారు. అవ్వాతాతల బాధలు చూస్తుంటే చంద్రబాబు మనిషా, శాడిస్టా అనిపిస్తుందన్నారు. తన మనుషులతో ఈసీకి లేఖ రాయించి వాలంటీర్లు పింఛన్ ఇవ్వకుండా అడ్డుకున్నారంటూ మండిపడ్డారు.