AP CM YS Jagan Mohan Reddy: ఏపీ సీఎం జగన్ ఈరోజు లా నేస్తం నిధులు విడుదల చేశారు. 2807మంది న్యాయవాదులకు 2023-24 సంవత్సరానికి సంబంధించి రెండో విడత లా నేస్తం నిధులు విడుదల చేశారు. ఆరు నెలలకు సంబంధించి వారికి ఆర్థిక సాయాన్ని అకౌంట్లలో జమ చేశారు. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 6069 మంది న్యాయవాదులకు మేలు జరిగిందని చెప్పారు జగన్. నాలుగున్నరేళ్ల కాల వ్యవధిలో వైసీపీ ప్రభుత్వం మొత్తం రూ.49.51 కోట్లు వారికి అందజేసిందని వివరించారు.
జూనియర్ న్యాయవాదులకు అండగా..
న్యాయవాద వృత్తిలో స్థిరపడాలనుకునేవారికి, కెరీర్ ప్రారంభించేవారికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు సీఎం జగన్. అందుకే వారికోసం ఈ పథకం ప్రారంభించామన్నారు. జూనియర్ న్యాయవాదులు వారి కాళ్లపై వారు నిలబడేందుకు వీలుగా ఈ పథకం ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వం లాయర్లకు ఏ రకంగా తోడుగా నిలబడుతోందో, పేద వాడి పక్షాన వారు కూడా అలాగే ఔదార్యం చూపిస్తూ, వారికి మంచి చేయాలని, మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. ఆ విధంగా మసలుకోవాలని ప్రతి అడ్వొకేట్ సోదరుడిని, చెల్లెమ్మను ప్రభుత్వం తరపున అర్థిస్తున్నానని చెప్పారు జగన్.
లా నేస్తం ఇలా..
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న జూనియర్ లాయర్లకు నెలకు రూ.5వేలు ప్రభుత్వం స్టైఫండ్ గా అందిస్తుంది. దీనికి వయో పరిమితి ఉంది. మూడేళ్లపాటు ఇలా స్టైఫండ్ అందిస్తారు. అంటే అర్హులైన జూనియర్ లాయర్లకు మూడేళ్లలో గరిష్టంగా 1.80 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది. తాజాగా లా నేస్తం నిధులు విడుదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,807 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.5వేలు స్టైఫండ్ విడుదల చేశారు. ఈ ఏడాది జులై నుంచి డిసెంబర్ వరకు 6 నెలల కాల వ్యవధికి ఒక్కొక్కరికి రూ.30 వేలు సాయం అందించారు.
లాయర్లకోసం ఏమేం చేస్తున్నామంటే..?
రూ.100 కోట్లతో అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఏర్పాటు చేశామని చెప్పారు సీఎం జగన్. అడ్వొకేట్ జనరల్ ఆధ్వర్యంలో ఈ ట్రస్ట్ కార్యకలాపాలు నడుస్తాయని, లా సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ ఇద్దరూ ఇందులో సభ్యులుగా ఉంటారని చెప్పారు సీఎం జగన్. కొవిడ్ సమయంలో ఈ ట్రస్ట్ ద్వారా లాయర్లకు మేలు జరిగిందని, 643 మందికి కొవిడ్ టైమ్ లో.. రూ.52 లక్షల సాయం చేశామని వివరించారు. 7,733 మంది లాయర్లకు రూ.11.56 కోట్ల రుణాలు మంజూరు చేశామన్నారు. 14,848 మంది అడ్వొకేట్లకు మెడిక్లెయిమ్ పాలసీ ద్వారా రూ.11.41 కోట్లు చెల్లించామని చెప్పారు.
లా నేస్తం లాంటి పథకాలు ఇతర రాష్ట్రాల్లో అమలులో లేకపోయినా.. సీఎం జగన్ గతంలో ఇచ్చిన హామీ మేరకు జూనియర్ లాయర్లకు అండగా నిలబడ్డారని చెబుతున్నారు వైసీపీ నేతలు. సమాజంలోని ప్రతి వర్గానికి తమ ప్రభుత్వ హయాంలో మంచి జరుగుతోందని వివరించారు. అన్ని వర్గాలకు అండగా నిలబడేందుకు సీఎం జగనన్ ఇలాంటి కార్యక్రమాలను రూపొందించారని, కరోనా కష్టకాలంలో కూడా ఎక్కడా ఆర్థిక సాయం విషయంలో వెనకడుగు వేయలేదని వివరిస్తున్నారు. సంక్షేమ పథకాల అమలులో మాత్రం వైసీపీ ప్రభుత్వం ఎక్కడా వెనకడుగు వేయడం లేదని చెబుతున్నారు ఆ పార్టీ నేతలు.