YS Jagan Mohan Reddy: 


చంద్రబాబు సాక్ష్యాలతో సహా దొరికిపోయారు: సీఎం జగన్


45 ఏళ్లుగా చంద్రబాబు రాష్ట్రాన్ని దోచుకుని తిన్నారని విమర్శించారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి. నిడదవోలులో వైఎస్‌ఆర్ కాపునేస్తం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్ట్  తరవాత తొలిసారి ఇలా స్పందించారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో ఆయన సాక్ష్యాలతో సహా దొరికిపోయారని, అందుకే అరెస్ట్ అయ్యారని అన్నారు. చట్టం ఎవరికైనా ఒకటే అని తేల్చి చెప్పారు. కొందరు దొంగల ముఠా సభ్యులు చంద్రబాబు అరెస్ట్‌ని జీర్ణించుకోలేకపోతున్నారని మండి పడ్డారు. గతంలో చంద్రబాబు ఆడియో, వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయారని అన్నారు. చట్టం అందరికీ ఒకటే అని చెప్పిన వాళ్లు ఇప్పటి వరకూ ఎవరూ లేరని, అలా చెప్పడం వల్లే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. తానేం తప్పు చేయలేదని చంద్రబాబు కప్పిపుచ్చుకుంటున్నారని అన్నారు. సాక్ష్యాలు ఆధారాలు చూసిన తరవాతే కోర్టు రిమాండ్‌కి పంపిందని స్పష్టం చేశారు. ఒత్తిడి చేసి మరీ సంతకాలు పెట్టించి స్కామ్‌ చేశారని విమర్శించారు. ఈ స్కామ్ కథంతా చంద్రబాబే నడిపారని, ఆయనను కాకుండా మరింకెవరని అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు.సాధారణ వ్యక్తి అవినీతికి పాల్పడితే ఎలాంటి శిక్ష పడుతుందో...చంద్రబాబు లాంటి వ్యక్తికీ అలాంటి శిక్షే పడుతుందని తేల్చి చెప్పారు. ఫేక్ అగ్రిమెంట్ దొంగల్ని ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేసిందని అన్నారు. 


పవన్‌పైనా సెటైర్లు 


చంద్రబాబు ఎన్ని సార్లు మోసం చేసినా ఆయనను రక్షించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని మండి పడ్డారు. ప్రశ్నిస్తా అన్న వ్యక్తి ఇంత అవినీతి జరుగుతున్నా ప్రశ్నించడం లేదని పవన్‌ కల్యాణ్‌పై పరోక్షంగా సెటైర్లు వేశారు. ములాఖత్ అని చెప్పి పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. జనం సొమ్ముని దోచుకున్న వ్యక్తిని జైల్లో పెట్టకూడదా అని ప్రశ్నించారు. చంద్రబాబుని కాపాడేందుకు కొందరు విశ్వప్రయత్నిస్తున్నారని అన్నారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్లాక్ మనీ పంచుతూ అడ్డంగా దొరికిపోయారని ఫైర్ అయ్యారు జగన్. కానీ ఆయన మాత్రం తనకేమీ తెలియదని చెప్పారని మండి పడ్డారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో సూత్రధారి చంద్రబాబేనని CID నిర్ధరించిందని చెప్పారు. రూ.371 కోట్లు ఎక్కడికి వెళ్లాయని ప్రశ్నించారు. ములాఖత్‌లో మిలాఖతై పొత్తు పెట్టుకున్న వాళ్లను ఏం చేయాలో మీరే చెప్పాలంటూ పవన్‌ను ఉద్దేశించి విమర్శలు చేశారు. ఓటుకు నోటు కేసులో ఫారెన్సిక్‌కి చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని అన్నారు సీఎం జగన్. ఆయన పీఏ ఛాటింగ్‌లను ఐటీ బయటపెట్టిందని వెల్లడించారు. ఇంత అడ్డగోలుగా దొరికిపోయినా ఇంకా ప్రశ్నిస్తా అంటూ చంద్రబాబు అనడం విడ్డూరంగా ఉందని అన్నారు. లేని కంపెనీని ఉన్నట్టుగా నకిలీ అగ్రిమెంట్ సృష్టించారని, ఈ అగ్రిమెంట్‌తో సీమెన్స్ కంపెనీ తమకు సంబంధం లేదని తేల్చి చెప్పిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు స్కిల్ స్కామ్‌లో రూ. 371 కోట్ల కొల్లగొట్టిన సూత్రధారులను, పాత్రధారులను కనిపెట్టాయని వెల్లడించారు. ఒత్తిడి తీసుకొచ్చి సంతకాలు పెట్టి నిధులు దోచుకున్నారని స్పష్టం చేశారు. ఎల్లో మీడియా నిజాల్ని చూపించదని మండి పడ్డారు. పైగా అవినీతి పరులకు మద్దతుగా ఉంటున్నాయని అన్నారు.