AP CM Jagan: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నదే సీఎం వైఎస్ జగన్ లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని వారికి.. ఆయా పథకాలు అందించిన నెలలోపు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది వైసీపీ సర్కారు. వెరిఫికేషన్ అనంతరం అర్హులైన వారికి ఆరు నెలల్లో లబ్ధి పొందేలా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా అర్హులను జల్లెడ పడుతూ మరీ లబ్ధి చేకూరుస్తున్నారు. డిసెంబర్ 2022 నుంచి జూలై 2023 వరకు వివిధ పథకాలకు అర్హులైన 2,62,169 మందికి రూ.216.34 కోట్లను సీఎం జగన్ బటన్ నొక్కి మరీ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు.  గురువారం రోజు క్యాంపు కార్యాలయంలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. కొత్తగా అర్హత పొందిన మరో లక్షఆ 49 వేల 875 మందికి పెన్షన్లు, 4 327 మందికి ఆరోగ్య శ్రీ కార్డులు, 2 లక్షల 312 మందికి రేషన్ కార్డులు, 12 వేల 69 మందికి ఇళ్ల పట్టాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించింది. 














అధికారం అంటే అజమాయిషీ కాదు.. ప్రజల పట్ల మమకారం చూపడం


ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా పథకాలు అందజేస్తున్నామని అన్నారు. ఏ కారణం చేతనైనా పథకాలు లబ్ధి అందని వారికి కూడా అందజేస్తున్నామన్నారు. అధికారం అంటే అజమాయిషీ కాదని, ప్రజల పట్ల మమకారం చూడపం అని వివరించారు. కొత్త పింఛన్లు, బియ్యం, ఆరోగ్య శ్రీ కార్డులు అందజేస్తున్నామని స్పష్టం చేశారు. ఇలా పింఛన్ల సంఖ్య మొత్తం 64 లక్షల 27 వేలకు చేరుకుందన్నారు. గత ప్రభుత్వంలో వెయ్యి రూపాయలుగా ఉన్న పింఛన్ ను 2750 రూపాయలకి చేర్చిందన్నారు. జగనన్న చేదోడు ద్వారా 43 వేల 131 మందికి సాయం అందిస్తున్నట్లు స్పష్టం చేశారు.