పేద విద్యార్థులకు ఉన్నత చదువులు చదివించాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపకల్పన చేసిన జగనన్న విద్యా దీవెన రెండో విడత కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభం కానుంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కి విద్యార్థుల తల్లుల అకౌంట్లలో డబ్బులు జమ చేయనున్నారు. రెండో విడతగా సుమారు 11 లక్షల మంది విద్యార్థులకు 693 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయనున్నారు.


ఇప్పటికే మొదటి దశ కింద ఏప్రిల్‌ 19న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 671 కోట్ల రూపాయలను జమ చేశారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను కూడా తాము విద్యార్థులకు అందజేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. చంద్రబాబు హయాంలో ఇవ్వాల్సిన 1,774 కోట్ల రూపాయలతో కలుపుకొని... విద్యా దీవెనతో 5573 కోట్ల రూపాయలు ఖర్చుపెడుతోందన్నట్టు చెబుతోంది ప్రభుత్వం. 


ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులు చదివే విద్యార్థులకు ప్రభుత్వం చెల్లించాల్సిన కాలేజీల ఫీజులను ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పేరుతో వారి తల్లుల అకౌంట్ల డబ్బులు వేస్తోంది. ప్రభుత్వం ఇప్పటి వరకు 1,62,75,373 మంది లబ్ధిదారల అకౌంట్స్‌లో 26వేల 677.82 కోట్ల రూపాయాలు వేసింది. 


నాడు–నేడు పథకం కింద ప్రీప్రైమరీ స్కూళ్లుగా మారబోతున్న అంగన్‌వాడీలలో పిల్లలు, తల్లుల ఆరోగ్యం కోసం పౌష్టికాహారం ఇస్తోంది. దీని కోసం వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పేరుతో ప్రతి ఏడాది 1,800 కోట్ల రూపాయలు వ్యయం చేస్తోంది.


ఇప్పటివరకూ విద్యాదీవెన, వసతి దీవెన, గోరుముద్దలు, అమ్మ ఒడి, విద్యాకానుక, మనబడి, నాడు నేడు కింద మొత్తం 25,714 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది.  మూడో దశ విద్యాదీవెన ఈ డిసెంబర్‌లో, నాలుగో విడత వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం అమలు చేయనున్నట్టు షెడ్యూల్‌ కూడా ప్రకటించింది. 


ఈ ఏడాది ఏప్రిల్‌లో మొదటి విడతగా 671.45 కోట్ల రూపాయలు తల్లిదండ్రులకు ఈ పథకంలో ఇచ్చింది. నేడు రెండో విడతగా దాదాపు 693.81 కోట్ల రూపాయలు ఇస్తోంది. మొత్తంగా 5,573.11 కోట్ల రూపాయలు ఇస్తోంది. జగనన్న వసతి దీవెన పథకం ద్వారా ఐటీఐ విద్యార్థులకు 10 వేలు రూపాయలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు 15 వేలు రూపాయలు, డిగ్రీ ఆపై కోర్సులు అభ్యసించే వారికి 20 వేల రూపాయల చొప్పున వసతి, భోజన ఖర్చుల కోసం ఇస్తోంది.


ALSO READ: జులై 29 గురువారం రాశిఫలాలు…. వృషభం, మిధునం, కన్య రాశివారు ఈ పని చేయకూడదు...