CM Jagan : సంక్షేమ హాస్టళ్లపై తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలు,  ప్రభుత్వ వసతి గృహాల్లో నాడు–నేడు పనులపై సీఎం ఆరా తీశారు. రెండు దశల్లో ప్రభుత్వ హాస్టళ్లలో నాడు–నేడు, మూడు దశల్లో గురుకుల పాఠశాల్లో నాడు–నేడు, హాస్టళ్ల నిర్వహణకు ప్రత్యేక అధికారి నియామ‌కం వంటి అంశాలపై సీఎం జ‌గ‌న్ స‌మావేశంలో ప్రస్తావించారు. గురుకుల పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్ల పర్యవేక్షణపై కీలక ఆదేశాలు ఇచ్చారు. స్కూల్‌ ఎడ్యుకేషన్‌ పరిధిలోకి గురుకుల పాఠశాలు, అకడమిక్‌ వ్యవహారాలు పర్యవేక్షణతో పాటుగా మండలాల్లో అకడమిక్‌ వ్యవహారాలు చూస్తున్న ఎంఈఓకు సంబంధిత మండలంలోని గురుకులపాఠశాలల అకడమిక్‌ బాధ్యతలను అప్పగించే విషయాన్ని సీఎం ప్రస్తావించారు. గురుకుల పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్ల నిర్వహణపై పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాల‌ని సీఎం అన్నారు. మండలాల్లో ఇద్దరు ఎంఈఓల నియామకం ద్వారా ఎలా పర్యవేక్షణ చేస్తూ ఆ తరహాలోనే ఇక్కడ కూడా పర్యవేక్షణ జరగాలని  సీఎం అన్నారు. ఇందు కోసం  ఎస్‌ఓపీలు రూపొందించాలని జ‌గ‌న్ సూచించారు. పర్యవేక్షణకోసం ప్రత్యేక యాప్ కూడా రూపొందించాలన్న సీఎం ఆదేశించారు. 


మౌలిక సదుపాయాలపై పర్యవేక్షణ 


అంతే కాదు మౌలిక సదుపాయాలు, భోజనం నాణ్యత, నిర్వహణ తదితర అంశాలపై క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలని, గురుకుల పాఠశాలలు, ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ వెల్ఫేర్‌ హాస్టళ్ల పై  అధికారులతో పర్యవేక్షణ చేయాలని, పర్యవేక్షణ వరకూ వీటిని ఇంటిగ్రేట్‌ చేయాలని సీఎం జగన్ చెప్పారు. ఒక్కో అధికారికి ప్రత్యేక పరిధిని నిర్ణయించి పర్యవేక్షణ చేయించాలన్న సీఎం, మండలాల్లో స్కూళ్ల నిర్వహణ, పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా నియమిస్తున్న రెండో ఎంఈవోకు కూడా విధివిధానాలు ఖరారుచేయాలని ఆదేశించారు. గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో నాడు–నేడు కింద చేపట్టనున్న పనులపై ప్రతిపాదనలను అధికారులు వివరించారు. గురుకుల పాఠశాలల్లో మూడు విడతలుగా నాడు–నేడు పనులు చేయాలని, రెండు విడతలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టళ్లలో నాడు–నేడు, పారిశుద్ధ్యం, పరిశుభ్రతలపైనా దృష్టిపెట్టాలని సీఎం జగన్ అన్నారు. డ్రైనేజీని లింక్‌ చేయడంపై దృష్టిపెట్టాలని, హాస్టల్‌ పిల్లలకు ఇచ్చే కాస్మోటిక్స్ సహా వస్తువులన్నీ నాణ్యతతో ఉండాలన్నారు. విద్యా కానుకతో పాటు వీటిని కూడా అందించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. 


హాస్టళ్లకు తప్పనిసరిగా ఇంటర్నెట్ 


అన్ని ప్రభుత్వ వసతి గృహాల్లో భోజనంలో నాణ్యత పెంచాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. ప్రతిరోజూ ఒక మెనూ ఇవ్వాలన్న సీఎం, ఇందుకు అవ‌స‌రం అయిన  ప్రతిపాదనలు తయారు చేసి ఇవ్వాలన్నారు. గురుకుల పాఠశాలలు, ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టళ్లలో దాదాపు 6 లక్షల మంది విద్యార్థులు ఉన్నార‌ని, ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు పెట్టే భోజనం అత్యంత నాణ్యతతో  ఉండాలన్నారు. హాస్టళ్లలో టాయిలెట్ల నిర్వహణ, అలాగే మౌలిక సదుపాయాల నిర్వహణ బాగుండాల‌న్నారు. హాస్టళ్లకు తప్పనిసరిగా ఇంటర్నెట్‌ సదుపాయం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. క్రమం తప్పకుండా వైద్యులు హాస్టళ్లకు వెళ్లి, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై పర్యవేక్షణ చేయాలన్నారు. ఇందుకు  ప్రత్యేక యాప్‌ను కూడా తయారుచేస్తున్నట్టు అధికారుల‌కు సీఎం వివ‌రించారు. ఇక విలేజ్‌ క్లినిక్స్, స్థానిక పీహెచ్‌సీలతో ప్రభుత్వ హాస్టళ్లను మ్యాపింగ్‌ చేయాలని, హాస్టళ్ల నిర్వహణలో ఖాళీలను కూడా గుర్తించి, భర్తీ చేయాలన్నారు.