AP CM Chandrababu: ఏపీ పొగాకు, ఆక్వా రైతుల సమస్య పరిష్కరించండి: కేంద్రానికి చంద్రబాబు లేఖ
Andhra Pradesh News | పెరిగిన పన్నులు, అమెరికా విధిస్తున్న 50 శాతం టారిఫ్ కారణంగా ఏపీలో పొగాకు, రూ. 25 వేల కోట్ల ఆక్వా ఎగుమతి రంగాలు తీవ్ర సంక్షోభంలో పడ్డాయని సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.

అమరావతి: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత ఏడాది విధించిన టారిఫ్‌లు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. అందులో భారత్ సైతం ఉందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏపీలో వ్యవసాయ రంగంపై ట్రంప్ టారిఫ్ ప్రభావంతో పలు పంటలు పండిస్తున్న రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. పన్నుల పెరుగుదల, అంతర్జాతీయ సుంకాల ప్రభావంతో పొగాకు, ఆక్వా రంగాల రైతులు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రెండు రంగాలపై ఆధారపడి లక్షల కుటుంబాలు జీవిస్తున్నాయని, ప్రస్తుత పరిస్థితుల వల్ల వారి జీవనోపాధి ప్రమాదంలో పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించి, మార్కెట్‌ను కాపాడేలా కేంద్ర ప్రభుత్వ విధానాల్లో మార్పులు తీసుకురావాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
రైతులను ఆదుకోవాలంటూ కేంద్రానికి చంద్రబాబు లేఖలు
ఆంధ్రప్రదేశ్‌లోని రైతులను ఆదుకోవాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్‌లకు విడివిడిగా అత్యవసర లేఖలు రాశారు. 2026 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన సవరించిన పన్నుల విధానం, ఎక్సైజ్ డ్యూటీ వల్ల పొగాకు రైతులు తీవ్ర నష్టాల్లోకి కూరుకుపోయారని వివరించారు. ఈ పెంచిన పన్నుల విధానాన్ని, ఎక్సైజ్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం వెంటనే మళ్లీ సమీక్షించాలని ఆయన తన లేఖలో కేంద్ర మంత్రులను కోరారు.
మరోవైపు ఆక్వా రంగాన్ని కాపాడేందుకు కేంద్రం తక్షణమే స్పందించాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. అమెరికా విధిస్తున్న 50 శాతం టారిఫ్ కారణంగా మొత్తం పన్ను భారం 60 శాతానికి చేరిందని, దీనివల్ల ఏపీ నుంచి జరిగే రూ. 25 వేల కోట్ల విలువైన ఎగుమతులు నిలిచిపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ సుంకాలు తగ్గించేలా అమెరికాతో దౌత్యపరమైన చర్చలు జరపాలని, ప్రత్యామ్నాయంగా రష్యాతో పాటు ఈయూ (EU), ఆస్ట్రేలియా దేశాలకు ఎగుమతులు పెంచేలా చర్యలు చేపట్టాలని తన లేఖలో చంద్రబాబు కోరారు.
ఆక్వా రైతులకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు పలు కీలక ప్రతిపాదనలను సీఎం చంద్రబాబు కేంద్రం ముందుంచారు. వర్కింగ్ క్యాపిటల్ పరిమితిని 30 శాతానికి పెంచాలని, ఆక్వా రైతులకు ఇచ్చే కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) పరిమితిని రూ. 1 లక్షకు పెంచాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా, దేశీయంగా రొయ్యల వినియోగాన్ని పెంచేందుకు వీలుగా సాయుధ దళాల ఆహార జాబితాలో రొయ్యలను చేర్చాలనే వినూత్న నిర్ణయాన్ని తీసుకోవాలని కేంద్ర మంత్రులను కోరారు.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























