AP CM Chandrababu: 2 రోజులపాటు తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి ఏపీ సీఎం చంద్రబాబు
Tamil Nadu Assembly Elections | ఏపీ సీఎం చంద్రబాబు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఎన్డీయే అభ్యర్థుల విజయం కోసం ఓటు వేయాలని ప్రజలను కోరనున్నారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. ఎన్డీఏ (NDA) కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఆయన రెండు రోజుల పాటు అక్కడ విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ నెల 20, 21 తేదీల్లో జరిగే ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా, కూటమి తరపున ఏపీ సీఎం చంద్రబాబు పలు కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగించనున్నారు.
ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం, ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం (ఏప్రిల్ 20న) మధ్యాహ్నం రాజధాని అమరావతి నుండి బయలుదేరి తమిళనాడులోని కోయంబత్తూరు చేరుకుంటారు. అక్కడి నుండి హోసూరు, చెన్నై, ఆవడి వంటి కీలక ప్రాంతాల్లో పర్యటిస్తారు. ముఖ్యంగా హోసూరు సమీపంలోని తాలిలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని చంద్రబాబు ప్రసంగించనున్నారు. అలాగే ఆవడిలో నిర్వహించే రోడ్ షో ద్వారా ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతు తెలపనున్నారు. పర్యటనలో రెండో రోజైన 21వ తేదీన మధురై మరియు సాత్తూర్ ప్రాంతాల్లో నిర్వహించే ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో ఆయన పాల్గొంటారు.
మహిళా రిజర్వేషన్ సాధించేవరకూ పోరాటం ఆగదు: ప్రధాని మోదీ
మహిళా బిల్లు విషయంలో ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, మహిళలకు సాధికారత కల్పించే వరకు తమ పోరాటం ఆగదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మహిళా బిల్లు ఆమోదం పొందకుండా పార్లమెంటులో కాంగ్రెస్, డీఎంకే (DMK) కూటమి నీచ రాజకీయాలకు పాల్పడిందని విమర్శించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కోయంబత్తూరులో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం దక్కే వరకు ఎన్డీయే అలుపెరగని పోరాటం చేస్తుందని, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని ప్రకటించారు.
పేద మహిళలు ఎంపీలు, ఎమ్మెల్యేలు అయ్యేవారు..
బిల్లు ఆమోదం పొంది ఉంటే ఎందరో పేద కుటుంబాల మహిళలు ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఎదిగే అవకాశం ఉండేదని, కానీ ప్రతిపక్షాలు ఆ అవకాశాన్ని అడ్డుకున్నాయని మోదీ ఆరోపించారు. ముఖ్యమంత్రి స్టాలిన్ తన కుటుంబ సభ్యులు తప్ప ఇతరులు నాయకులుగా ఎదగడాన్ని సహించలేకపోతున్నారని విమర్శించారు. డీఎంకే నేతలు నల్ల దుస్తులు ధరించి నిరసనలు తెలిపినంత మాత్రాన వారి వెనుక ఉన్న దుష్ట ఆలోచనలను ప్రజలు గమనించరనుకోవడం పొరపాటు అని మండిపడ్డారు. డీఎంకే నేతలు ఎక్కడ కనిపించినా మహిళా బిల్లును ఎందుకు అడ్డుకున్నారని నిలదీయాలని మోదీ ఓటర్లకు పిలుపునిచ్చారు.
డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే తమిళనాడు అభివృద్ధి
తమిళనాడు అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉండాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. రెండు చోట్లా ఒకే కూటమి ప్రభుత్వం ఉంటే పథకాలు వేగంగా ప్రజలకు అందుతాయని, అభివృద్ధి పనులు ఊపందుకుంటాయని వివరించారు. తమిళనాడు ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం భారతీయ జనతా పార్టీ (BJP) అనేక గ్యారంటీలను ఇస్తోందని, ప్రజలు విజ్ఞతతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ప్రధాని మోదీ పాల్గొన్న ఈ ప్రచార సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిసామి, బీజేపీ నేత అన్నామలై తదితర ప్రముఖ నేతలు పాల్గొన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు



















