Chandrababu pays tribute to Senior NTR on his Death Anniversary | అమరావతి: నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నివాళి అర్పించారు. ఆయన చేసిన సేవల్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఎన్టీఆర్ ఆశయాలను సాధిద్దామని చంద్రబాబు ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
'సమాజమే దేవాలయం... ప్రజలే దేవుళ్ళు' అన్న సూక్తిని మొదటిసారిగా రాజకీయాలకు పరిచయం చేసిన మానవతావాది... నిరుపేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన మహనీయుడు ఎన్టీఆర్. బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన సమతావాది... స్త్రీలకు సాధికారతనిచ్చిన సంస్కర్త... స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆ మహానాయకుని స్మృతికి నివాళులర్పిద్దాం. సంక్షేమం, అభివృద్ది, సుపరిపాలనతో... "అధికారం అంటే పేదల జీవితాలు మార్చేందుకు వచ్చిన అవకాశం" అని నిరూపించిన మాననీయులు ఎన్టీఆర్ ఆశించిన సమసమాజాన్ని సాధించుకుందాం. ఎన్టీఆర్ ఆశయ సాధనలో అనుక్షణం పనిచేస్తామని... తెలుగు జాతిని నెంబర్ వన్ చేసేందుకు కంకణబద్ధులై ఉన్నామని తెలుపుతూ... ఆ యుగపురుషుని వర్థంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను’ అని చంద్రబాబు పోస్ట్ చేశారు.
ఎన్టీఆర్‌కు నారా లోకేష్ ఘన నివాళి
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, యుగపురుషుడు నందమూరి తారక రామారావు 29వ వర్థంతి సందర్భంగా ఏపీ మంత్రి నారా లోకేష్ ఘన నివాళి అర్పించారు. ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదు.. ప్రభంజనం అని, అదొక సంచలనంగా అభివర్ణించారు. తెలుగువాడి విశ్వరూపం చూపించారు. వెండితెరపై రారాజుగా ఎన్టీఆర్ వెలుగొందారు, రాజకీయాల్లో మహానాయకుడిగా రాణించారు. తెలుగుదనానికి ప్రతిరూపంగా ఆ మహనీయుడు నిలిచారు. తెలుగుజాతి ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, ప్రజాసంక్షేమం అనే సిద్ధాంతాలపై తెలుగుదేశం పార్టీ (TDP) ఏర్పాటైంది. సమాజమే దేవాలయం- ప్రజలే దేవుళ్లని ఎన్టీఆర్ నినదించారు. కోట్లాది హృదయాల్లో కొలువైన మా తాతగారే నాకు నిత్యస్ఫూర్తి అని ఆయన వర్థంతి సందర్భంగా నారా లోకేష్ ఘన నివాళులర్పించారు.
సీఎం చంద్రబాబు నేటి కార్యక్రమాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు (శనివారం) గుంటూరు, కడప జిల్లాల్లో పర్యటించనున్నారు. మొదటగా గుంటూరు పర్యటనలో భాగంగా వాట్సాప్ గవర్నెన్స్ సేవలను చంద్రబాబు ప్రారంభించనున్నారు. వేస్టు టూ ఎనర్జీ ప్లాంటు (Waste To Energy Plant)ను కూడా చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఆ తరువాత చంద్రబాబు కడప జిల్లాలో పర్యటించనున్నారు. మైదుకూరు నియోజకవర్గంలో నిర్వహించనున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారని అధికారులు వెల్లడించారు. కడప జిల్లాకు వస్తుండటంతో సీఎం చంద్రబాబు రానుండటంతో పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు టీడీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గంలో కార్యక్రమాల అనంతరం ఆయన తిరిగి అమరావతికి చేరుకుంటారు.