Free Sand Policy in Andhra Pradesh | అమరావతి: కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలలో ఉచిత ఇసుక పాలసీ ఒకటి. అయితే వైసీపీ హయాంలోనే ఇసుక తక్కువ ధరలకు లభించేదని, చంద్రబాబు ప్రభుత్వం ఫ్రీ సాండ్ పాలసీ తెచ్చినా గత ప్రభుత్వంలో కంటే ఇప్పుడే అధిక ధరలకు ఇసుక లభిస్తుందని ప్రచారం జరుగుతోంది. వైసీపీ నేతలు సైతం ఇదే విషయాన్ని మొదటిరోజు నుంచి ప్రశ్నిస్తున్నారు. అసలే లడ్డూ అంశం వివాదాస్పదం కావడం, ఆపై సనాతన ధర్మం రక్షణ అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. అయితే సోషల్‌ మీడియా వేదికగా ఉచిత ఇసుకపై జరుగుతున్న అసత్య ప్రచారంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 


వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశాలు


దుష్ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలకు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గనుల శాఖ ముఖ్యకార్యదర్శి ముఖేశ్‌ కుమార్‌ మీనాకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేలా సోషల్ మీడియాలో, కొన్ని మీడియా సంస్థల్లో జరుగుతున్న ప్రచారంపై చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రచారం చూసి ప్రజలు నిజమే అనుకునే పరిస్థితి వస్తుందన్నారు. కనుక ఉచిత ఇసుక విధానంపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని ముఖేశ్ కుమార్ మీనాను ఆదేశించారు. 


ప్రజలను తప్పుదోవ పట్టిస్తే ఉపేక్షించేది లేదు


లబ్ధి పొందాల్సిన ప్రజలకు రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానంపై అనుమానాలు రేకెత్తేలా దుష్ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ విషయంపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసి, దీనిపై జరుగుతున్న దుష్ప్రచారంపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజలు తమపై ఎంతో నమ్మకంతో గెలిపించుకున్నారని, అందుకే కూటమి ప్రభుత్వం నిజాయితీగా ఉచిత ఇసుక విధానం అమలు చేస్తుందన్నారు. కొందరు రాజకీయ, స్వార్థ ప్రయోజనాల కోసం ఏపీ ప్రభుత్వంపై బుదర జల్లే ప్రయత్నం చేస్తున్నారని.. వాస్తవాలు వెలికితీసి, బాధ్యులను  ఉపేక్షించవద్దని సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలిచ్చారు.


Also Read: Dantewada Encounter: దంతేవాడ ఎన్‌కౌంటర్‌లో ఆ అగ్రనేతలు మిస్, కీలక విషయాలు వెల్లడించిన ఎస్పీలు