AP Cabintet : ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బందరు పోర్టు కు పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రూ. 3940 కోట్ల రుణం తీసుకునేందుకు మంత్రివర్గం అంగీకారం తెలియజేసింది. 9.75 శాతం వడ్డీతో రూ. 3940 కోట్ల రుణం తీసుకోనుంది. అటు నెల్లూరు బ్యారేజీకి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి బ్యారేజీగా పేరు మార్చేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. గ్రానైట్ కంపెనీలకు విద్యుత్ రాయితీలకు అంగీకారం తెలిపిన కేబినెట్… యూనిట్‌కు రూ. 2 చొప్పున వసూలు చేయాలని నిర్ణయించింది.కొన్ని జిల్లాల కేంద్రాలను అర్బన్, రూరల్ మండలాలుగా విభజించేందుకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.
విజయనగరం, ఏలూరు, మచిలీపట్నం, ఒంగోలు, నంద్యాల, అనంత, చిత్తూరు జిల్లా కేంద్రాలను అర్బన్, రూరల్ మండలాలుగా విభజించాలని నిర్ణయించింది. తాడేపల్లిగూడెంలో పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటుకు కేబినెట్ అంగీకారం తెలిపింది. వైద్యారోగ్య శాఖలో రిక్రూట్‌మెంట్ కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్టు ఏర్పాటుకు అంగీకారం తెలిపింది.భారీ పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డు ప్రతిపాదనలను కేబినెట్‌లో చర్చించి ఆమోదం తెలిపారు. సుమారు రూ.లక్షా 45 వేల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. న్యూఎనర్జీ పార్క్ ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్.. 2 విడతల్లో మొత్తంగా రూ.1.10 లక్షల కోట్లతో న్యూఎనర్జీ పార్క్.. 1000 మెగావాట్ల చొప్పున విండ్, సోలార్ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.ఎన్టీపీసీ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద న్యూ ఎనర్జీ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొదటి విడతలో రూ.55 వేల కోట్లు, రెండో విడతలో రూ.55వేల కోట్లు పెట్టుబడికి అంగీకారం తెలిపింది. మొత్తంగా రూ.1,10,000 కోట్ల పెట్టుబడిని ప్రభుత్వం పెట్టనుంది. ఫేజ్ వన్‌లో 30 వేల మందికి, ఫేజ్ టూ లో 31వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు. నాలుగు విడతల్లో మొత్తంగా రూ.10,500 కోట్ల పెట్టుబడి పెట్టనుండగా… 2 వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు.అలాగే వైజాగ్ టెక్ పార్కుకు 60 ఎకరాలు కేటాయించడంతో పాటు, వంద మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త పాలసీలో భాగంగా పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది.
కేబినెట్ సమావేశంలో రెండు శాఖల మంత్రుల్ని సీఎం జగన్ ప్రత్యేకంగా అభినందించినట్లుగా తెలుస్తోంది. విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ, వైద్య ఆరోగ్య మంత్రి విడదల రజనీ బాగా పనిచేస్తున్నారని సీఎం ప్రశంసించారు. తన మంత్రిత్వ శాఖ ధాన్యం సేకరణలో బాగా పని చేసిందని.. మరో మంత్రి కారుమూరి ప్రస్తావించారు. ఈ సందర్భంగా మిమ్మల్ని కూడా అభినందించాలా అని జగన్ చమత్కరించారు. పౌరసరఫరాల శాఖ కూడా బాగా పని చేస్తోందన్నారు.
ఉగాదికి అందించే సంక్షేమ పథకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉగాది సంబరాలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. అజెండాలోని అన్ని అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వైయస్‌ఆర్ లా నేస్తం, వైయస్‌ఆర్ ఆసరా, ఈబీసీ నేస్తం, వైయస్‌ఆర్ కల్యాణమస్తు పథకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెనకు మంత్రిమండలి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
క్యాబినెట్ సమావేశం అనంతరం ఇటీవల మరణించిన తెలుగు సినీ ప్రముఖులు కృష్ణ, కృష్ణంరాజు, కైకాల సత్యనారాయణ, చలపతిరావు, ఎం. బాలయ్య, కే.విశ్వనాథ్, వాణి జయరామ్, జమున, డైరెక్టర్ సాగర్‌కు రాష్ట్ర మంత్రివర్గం నివాళి అర్పిస్తూ మౌనం పాటించింది.