AP Cabinet Meeting:ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి భేటీ(Cabinet Meeting) అయింది. కేబినెట్ భేటీలో బడ్జెట్(Budget) ప్రతిపాదనలు, సభలో ప్రవేశపెట్టే ఇతర బిల్లులపై మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. ఈ సమావేశం ప్రారంభం కాగానే దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి(Mekapati Goutham Reddy)కి మంత్రి మండలి రెండు నిమిషాల పాటు నివాళులర్పించింది.  ఉద్యోగుల వయో పరిమితి వయస్సు 62 ఏళ్లకు పెంపు ప్రతిపాదన బిల్లుకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 



రాష్ట్రంలో రెండో భాషగా ఉర్ధూ                 


ఏపీ అధికార భాషా చట్టం 1966 సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఉర్దూ(Urdu)ను రెండో భాషగా గుర్తిస్తూ చట్ట సవరణ చేయనున్నారు. 35 అజెండా అంశాలపై ఏపీ కేబినెట్‌లో చర్చించింది. సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తొలుత దివంగత మంత్రి, మంత్రివర్గ సహచరుడు గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతి పట్ల కేబినెట్ సంతాపం తెలిపింది. జిల్లాల విభజనకు సంబంధించి వచ్చిన అభ్యంతరాలపై మంత్రివర్గం చర్చించింది.



ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు


స్టేట్‌ వక్ఫ్ ట్రిబ్యునల్‌లో 8 రెగ్యులర్, 4 అవుట్‌ సోర్సింగ్‌ పోస్టులకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసుకున్న వారికి తెలుగుతో పాటుగా ఉర్ధూను సెకెండ్‌ లాంగ్వేజ్‌గా చదువుకునేందుకు అవసరమైన చట్ట సవరణకు‌ ఆమోదం తెలిపింది. కర్నూలుకు చెందిన ఇండియన్‌ డెఫ్‌ టెన్నిస్‌ కెప్టెన్, 2017 డెఫ్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతక విజేత షేక్‌ జాఫ్రిన్‌కు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలన్న నిర్ణయానికి కేబినెట్‌ అంగీకరించింది. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో గోదాముల నిర్మాణానికి స్టాంప్‌ డ్యూటీ మినహాయింపు బిల్లుకు మంత్రి మండలి ఆమోదించింది. తూనికలు, కొలతలశాఖలో నిబంధనలు అమలు కోసం మెరుగైన చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. డిప్యూటీ కంట్రోలర్‌ పోస్టును జాయింట్‌ కంట్రోలర్‌(అడ్మిన్‌) పోస్టుకు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్‌ హార్భర్ల నిర్మాణానికి పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చింది. రూ.1234 కోట్లతో మూడు ఫిషింగ్‌ హార్భర్ల నిర్మాణం, రామాయపట్నం, భావనపాడు, మచిలీపట్నం పోర్టుల నిర్మాణానికి రూ.8741కోట్ల రుణ సమీకరణ చేపట్టాలని నిర్ణయించింది. ప్రభుత్వ గ్యారంటీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 


కొత్త విమాన సర్వీసులకు ఇండిగోతో ఆమోదం 


బెంగుళూరు–కడప, విశాఖపట్నం–కడప నడుమ వారానికి మూడు విమాన సర్వీసులు నడపాలని కేబినెట్ నిర్ణయించింది. ఇప్పటికే కడప నుంచి పలు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి.  వీటికి అదనంగా కొత్త సర్వీసులకు ఆమోదం తెలిపింది. మార్చి 27 నుంచి ఈ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇండిగోతో ఏపీఏడీసీఎల్‌ ఒప్పందం చేసుకోనుంది. సర్వీసులు మొదలైన తర్వాత ఏడాదికి రూ.15 కోట్ల మేర మద్ధతు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రాజెక్టు –2 కింద చెరువులకు నీళ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం బైపాస్‌ కాలువ నిర్మాణం చేపట్టనుంది. ఇందుకు రూ.214.85 కోట్ల ఖర్చు ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదించింది. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పడతదిక గ్రామం వద్ద ఉప్పుటేరుపై 1.4 కిలోమీటర్ల మేర రెగ్యులేటర్‌– బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 


టీటీడీ బిల్లుకు కేబినెట్ ఆమోదం 


పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం మల్లపర్రు వద్ద రెగ్యులేటర్‌ బ్రిడ్జి, లాకుల నిర్మాణానికి పరిపాలనా పరమైన అనుమతులకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న డిగ్రీ కాలేజీలో 24 టీచింగ్‌ పోస్టులు, 10 నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్చరీ క్రీడాకారిణి, అర్జున అవార్డు గ్రహీత కుమారి జ్యోతి సురేఖ వెన్నంకు డిప్యూటీ కలెక్టర్‌ నియామకానికి సంబంధించిన ప్రతిపాదనలకు కేబినెట్‌ అంగీకరించింది. తిరుమల తిరుపతి దేవస్ధానం ప్రత్యేక ఆహ్వానితులపై అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బిల్లుకు ఆమోదం తెలిపింది. ఆర్మ్‌డ్ రిజర్వ్‌ పోర్స్‌లో 17 ఆఫీసర్‌ లెవల్‌ (7 ఏఏస్పీ,10 డీఎస్పీ) కొత్త పోస్టులకు ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ శాసనసభలో ప్రవేశపెట్టనున్న బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 165 మొబైల్‌ వెటర్నరీ క్లినిక్‌ల ఆపరేషన్‌ అండ్‌ మెయింటైనెన్స్‌ (ఓఅండ్‌ఎం) కోసం రూ.75.24 కోట్లు మంజూరు చేయనుంది. ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా చింతలదేవి వద్ద నేషనల్‌ కామధేను బ్రీడింగ్‌ సెంటర్‌ (ఎన్‌కేబీసీ) ఏర్పాటు, మొబైల్‌ ఆంబ్యులేటరీ వెటర్నరీ క్లినిక్‌ ప్రాజెక్టులో భాగంగా ఫేజ్‌ –2లో  165 మొబైల్‌ వెటర్నరీ క్లినిక్‌ల కొనుగోలుకు సంబంధించిన ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 


13 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు 


ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తొలి రోజు నిరసనల మధ్య ముగిసింది. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటూ టీడీపీ(TDP) సభ్యులు ఆందోళనకు దిగారు. గవర్నర్ ప్రసంగ పత్రాలను చించివేసి, సమావేశాన్ని బాయ్ కాట్ చేశారు. మరోవైపు గవర్నర్ ప్రసంగం అనంతరం తొలి రోజు అసెంబ్లీ సమావేశం వాయిదా పడింది. అనంతరం జరిగిన బీఏసీ సమావేశంలో 13 రోజులపాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు(Budget Session) నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 25 వరకూ కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. దివంగత గౌతమ్‌ రెడ్డి మృతికి గౌరవ సూచకంగా ఈనెల 9న సభకు సెలవు ప్రకటించారు. 


టీడీపీ వ్యూహం అర్థం అయింది : శ్రీకాంత్ రెడ్డి 


ఉభయ సభల్లో గవర్నర్ ప్రసంగానికి టీడీపీ అడుగడుగునా అడ్డుకుందని ప్రభుత్వ చీఫ్ విప్ గండికోట శ్రీకాంత్ రెడ్డి(Srikanht Reddy) అన్నారు. శాసనసభలో టీడీపీ సభ్యులు అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. టీడీపీ నేతలు తమ ప్రవర్తనపై పునరాలోచన చేసుకోవాలన్నారు. పబ్లిసిటీ కోసమే టీడీపీ సభ్యులు సభలో ఈ తరహాలో ప్రవర్తించారని విమర్శించారు. గవర్నర్ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదన్న విషయాన్ని టీడీపీ గుర్తించాలన్నారు. గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగిలినప్పుడే శాసనసభలో టీడీపీ వ్యూహం అర్ధం అయ్యిందన్నారు. అమరావతిలో రైతులు లేరని, ధర్నాలు చేస్తున్న వారు ఎప్పుడైనా వ్యవసాయ ఇబ్బందులు గురించి మాట్లాడలేదన్నారు.  ఎప్పుడూ భూముల విలువ గురించి మాత్రమే వారు మాట్లాడుతున్నారని విమర్శించారు. గవర్నర్ ప్రసంగాన్ని వైసీపీ సమర్ధిస్తుందన్నారు. సభలో టీడీపీ అజెండా ఏమిటో అర్థం అయ్యిందన్నారు. 


బీఏసీలోనూ రాజకీయాలు 


బీఏసీ సమావేశంలోనూ టీడీపీ రాజకీయాల కోసమే ప్రయత్నాలు చేసిందని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. వైసీపీ(Ysrcp) 20 అంశాలపై చర్చకు ప్రస్తావించిందన్నారు. టీడీపీ కూడా 20 అంశాలు ప్రస్తావించిందన్నారు. రేపు దివంగత మంత్రి గౌతమ్ రెడ్డికి సభ సంతాపం తెలపనుందన్నారు. 10 తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానం చేస్తామన్నారు. 11వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.