Agri Gold Victims: ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అగ్రిగోల్డ్ బాధితుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కఠిన వైఖరి అవలంబించారు. అమరావతి సచివాలయంలో గురువారం  నాడు సుమారు మూడున్నర గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో అగ్రిగోల్డ్ అంశంపై కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలన్న ప్రభుత్వ సంకల్పానికి అధికారుల అలసత్వం అడ్డంకిగా మారడంపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.  

Continues below advertisement

 ఉన్నతాధికారులపై ముఖ్యమంత్రి నిప్పులు 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో అగ్రిగోల్డ్ ఇష్యూ ప్రస్తావనకు రాగానే వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బాధితుల సమస్యల పరిష్కారం కోసం తక్షణమే ఏర్పాటు చేయాల్సిన కేబినెట్ సబ్ కమిటీ  ప్రక్రియ ఎందుకు పెండింగ్‌లో పడిందంటూ సీఎం అధికారులను నిలదీశారు.  బాధితులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తున్నప్పటికీ, యంత్రాంగంలో ఈ స్థాయి నిర్లక్ష్యం ఏంటి  అంటూ ఉన్నతాధికారులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది మంది సామాన్యుల జీవితాలతో ముడిపడి ఉన్న ఇలాంటి సున్నితమైన అంశాల్లో తాత్సార్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు.

Continues below advertisement

 ఆరు నెలల డెడ్‌లైన్ - మంత్రుల బృందం ఏర్పాటు 

గత ప్రభుత్వాల హయాంలో అగ్రిగోల్డ్ ఆస్తుల అటాచ్‌మెంట్, నిధుల రికవరీ ప్రక్రియలో జరిగిన లోపాలను, సిఐడి   అధికారుల వైఖరిని ఈ సందర్భంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ సమస్యను కేవలం చర్చలకే పరిమితం చేయకుండా, త్వరలోనే మంత్రుల బృందాన్ని అధికారికంగా రంగంలోకి దించబోతున్నట్లు సీఎం ప్రకటించారు. రాబోయే ఆరు నెలల కాలంలోనే అగ్రిగోల్డ్ డిపాజిటర్ల బాధితుల క్లెయిమ్‌లను పరిశీలించి, వారికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా కార్యాచరణ ముగించాలని అధికారులకు ఖచ్చితమైన డెడ్‌లైన్‌ విధించారు.

 వేగవంతానికి 31 కొత్త పోస్టుల మంజూరు 

అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, సమస్యను వేగంగా కొలిక్కి తెచ్చేందుకు చంద్రబాబు కేబినెట్ ఒక కీలకమైన పరిపాలనా నిర్ణయాన్ని తీసుకుంది. అగ్రిగోల్డ్ కేసుల విచారణను, లీగల్ కాంప్లికేషన్లను త్వరితగతిన క్లియర్ చేసేందుకు వీలుగా ప్రభుత్వం ప్రత్యేకంగా 31 కొత్త పోస్టులను మంజూరు చేస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కొత్త పోస్టుల్లో న్యాయ నిపుణులు, రెవెన్యూ అధికారులు , అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది ఉంటారు. వీరి ద్వారా బాధితుల దరఖాస్తుల స్క్రీనింగ్,  ఆస్తుల వేలం ప్రక్రియ వేగవంతం కానుంది.

అమరావతి అభివృద్ధి, ఇతర కీలక కేబినెట్ నిర్ణయాలు 

అగ్రిగోల్డ్ ఇష్యూతో పాటు ఈ కేబినెట్ భేటీలో రాజధాని అమరావతి అభివృద్ధిపై సర్కార్ పెద్ద పీట వేసింది. అమరావతి హైకోర్టు పరిసర ప్రాంతాల్లో రూ. 547 కోట్ల వ్యయంతో మౌలిక వసతుల కల్పనకు, అలాగే ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ ట్రిబ్యునల్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దాదాపు 20కి పైగా కీలక ఎజెండా అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన మంత్రుల మండలి.. రాష్ట్రంలో ఉపాధి కల్పన, మౌలిక వసతులు మరియు కొత్త పెట్టుబడుల ప్రతిపాదనలకు అనుమతులు మంజూరు చేసింది. దాదాపు 11 లక్షలకు పైగా బాధితులు ఉన్న అగ్రిగోల్డ్ కుంభకోణాన్ని త్వరగా ముగించాలన్న చంద్రబాబు సర్కార్ నిర్ణయం వేలాది కుటుంబాల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. సీఎం స్వయంగా గడువు విధించి, కొత్త పోస్టులను మంజూరు చేయడం ద్వారా ఈ ప్రక్రియలో ఇకపై జాప్యానికి తావుండదని స్పష్టమైన సంకేతాలు పంపినట్లయింది. మరి ఈ కొత్త 31 పోస్టుల నియామకం, కేబినెట్ సబ్ కమిటీల నివేదికల అనంతరం ఆరు నెలల్లో బాధితుల చేతికి డబ్బులు ఎలా అందుతాయనేది వేచి చూడాలి.