AP Cabinet Key Decisions: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతను గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పలు సంచలన నిర్ణయాలకు వేదికైంది. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల వల్ల ఇంధన పొదుపు పాటించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుకు స్పందిస్తూ, ఏపీ ప్రభుత్వం భారీ పొదుపు చర్యలను ప్రకటించింది. సుమారు నాలుగు గంటల పాటు సాగిన ఈ భేటీలో.. కేవలం పాలనా పరమైన నిర్ణయాలే కాకుండా, పర్యావరణ పరిరక్షణ , ప్రభుత్వ వ్యయం తగ్గింపుపై కేబినెట్ ప్రత్యేక దృష్టి సారించింది.
వారంలో ఒకరోజు నో వెహికల్ డే
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా వారానికి ఒకరోజును నో వెహికల్ డే గా పాటించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఆ రోజున మంత్రులు, ఉన్నతాధికారులు తమ సొంత, అధికారిక వాహనాలను పక్కన పెట్టాలని సీఎం సూచించారు. దానికి బదులుగా ప్రజా రవాణా ఆర్టీసీ బస్సులు , ఎలక్ట్రిక్ వాహనాలు లేదా సైకిళ్లను వాడాలని నిర్ణయించారు. సామాన్యులకు ఆదర్శంగా నిలిచేలా మంత్రులందరూ ఈ నిబంధనను ఖచ్చితంగా పాటించాలని ప్రభుత్వం తీర్మానించింది.
కాన్వాయ్‌ల సైజు సగానికి తగ్గింపు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పటికే తమ కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను 50 శాతం తగ్గించుకోగా, ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మంత్రులందరికీ వర్తింపజేయాలని కేబినెట్ నిర్ణయించింది. జిల్లాల పర్యటనల్లో కూడా భద్రతా ప్రోటోకాల్ దెబ్బతినకుండా వాహనాల వినియోగాన్ని పరిమితం చేయాలని ఆదేశించారు. అనవసరమైన విదేశీ పర్యటనలను కూడా కొన్నాళ్ల పాటు వాయిదా వేసుకోవాలని మంత్రులకు సీఎం సూచించారు.
వర్క్ ఫ్రమ్ హోమ్ , వర్చువల్ మీటింగ్స్
పాలనా యంత్రాంగంలో ఆధునిక సాంకేతికతను జోడించి ఖర్చులను తగ్గించాలని కేబినెట్ నిర్ణయించింది. సచివాలయానికి లేదా కార్యాలయానికి రావాల్సిన అవసరం లేని ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కల్పించాలని, వీలైనంత వరకు సమావేశాలను వర్చువల్ పద్ధతిలోనే నిర్వహించాలని నిర్ణయించారు. ఇది రవాణా ఖర్చులను తగ్గించడమే కాకుండా, సమయాన్ని కూడా ఆదా చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీ టెంపరేచర్‌ను 24 నుండి 27 డిగ్రీల మధ్య నిర్వహించడం ద్వారా విద్యుత్ ఆదా చేయాలని నిర్ణయించారు.
భవిష్యత్తు నగరం.. సోలార్ వైపు పయనం
ప్రభుత్వ భవనాలు కార్యక్రమాల్లో సోలార్ ఎనర్జీ వినియోగాన్ని పెంచాలని, అట్టహాసంగా చేసే ఖర్చులను నియంత్రించాలని నిర్ణయించారు. అమరావతి నిర్మాణ పనులపై కూడా చర్చించిన కేబినెట్, అంతర్జాతీయ పరిణామాల దృష్ట్యా ఆచితూచి అడుగులు వేయాలని భావిస్తోంది. వ్యక్తిగత ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలే ముఖ్యం అనే నినాదంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఈ పొదుపు చర్యల ద్వారా ఆదా అయ్యే నిధులను రాష్ట్రంలోని ఇతర సంక్షేమ పథకాలకు మళ్లించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
