Chandrababu Naidu Action on Social Media Trolls:   భావప్రకటన స్వేచ్ఛ ముసుగులో సోషల్ మీడియా వేదికగా చెలరేగిపోతూ, అడ్డగోలు ట్రోలింగ్‌కు పాల్పడుతున్న వికృత మనస్తత్వాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ  సమావేశంలో ఈ అంశంపై అత్యంత సీరియస్ చర్చ జరిగింది. సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేసే వారిపై, వ్యక్తిగత దూషణలకు దిగే వారిపై చట్టపరమైన చర్యలను వేగవంతం చేసేందుకు , పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఒక  టాస్క్‌ఫోర్స్ నియమించాలని కేబినెట్ నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తూ, సమాజంలో అశాంతి రేపుతున్న వారిని ఇకపై ఏమాత్రం ఉపేక్షించేది లేదని ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. 

Continues below advertisement

 డీజీపీ సంచలన నివేదిక - ప్రభుత్వంపై కుట్రపూరిత ప్రచారం! 

ఈ కేబినెట్ భేటీలో రాష్ట్ర పోలీస్ బాస్  సోషల్ మీడియా అక్రమాలపై ఒక సమగ్రమైన ప్రత్యేక నివేదికను మంత్రివర్గం ముందు ఉంచారు. ఇటీవల అరెస్ట్ అయిన  ప్రశ్న ఛానెల్ నిర్వాహకుడు జోసఫ్ రావణ్‌తో పాటు మరికొందరు వ్యక్తులు, గ్రూపులు పనిగట్టుకుని ప్రభుత్వంపై తప్పుడు, అబద్ధపు ప్రచారాలు చేస్తున్న తీరును నివేదికలో ఆధారాలతో సహా పొందుపరిచారు. కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా.. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేలా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా అత్యంత వ్యూహాత్మకంగా విద్వేషాన్ని నూరిపోస్తున్నారని డీజీపీ నివేదికలో పేర్కొనడం కేబినెట్‌లో తీవ్ర కలకలం రేపింది.   చట్టపరమైన చర్యల కోసం అదనపు పీపీల నియామకం! 

Continues below advertisement

డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై నిరంతరం నోటి విరోచనాలు చేసుకునే ఇటువంటి మానసిక రోగులకు చట్టం పవర్ చూపించాల్సిందేనని మంత్రులు ఏకాభిప్రాయానికి వచ్చారు. సోషల్ మీడియా నేరగాళ్లపై నమోదవుతున్న కేసులను కోర్టుల్లో బలంగా వాదించడానికి, నిందితులకు త్వరగా శిక్షలు పడేలా చేయడానికి అవసరమైతే ప్రత్యేకంగా  అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లను  నియమించాలని కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సైబర్ క్రైమ్ చట్టాలను మరింత కఠినంగా అమలు చేస్తూ, ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో విచారణ జరిపించేలా న్యాయపరమైన మౌలిక వసతులను బలోపేతం చేయాలని ఐటీ, హోంశాఖ అధికారులను సీఎం ఆదేశించారు.   సెలబ్రిటీ పిచ్చికి షాక్ ట్రీట్‌మెంట్ 

అరెస్ట్ అయితే పబ్లిసిటీ వస్తుందనే చీప్ పాపులారిటీ పిచ్చితో రెచ్చిపోతున్న వారికి ఈ టాస్క్‌ఫోర్స్ చర్యలు ఒక గట్టి  షాక్ ట్రీట్‌మెంట్  కానున్నాయి. ఒకసారి తప్పు చేస్తే మళ్లీ జీవితంలో సోషల్ మీడియా వైపు చూడాలన్నా భయపడేలా జైలు శిక్షలు, భారీ జరిమానాలు పడేలా లీగల్ యాక్షన్ ప్లాన్ సిద్ధమైంది. ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంటుందని, అయితే కుటుంబాలను రోడ్డుకు ఈడ్చడం, మతపరమైన విద్వేషాలు రేపడం  వాక్ స్వేచ్ఛ కిందికి రాదనే విషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇకపై ఫేక్ ఐడీల వెనుక దాక్కుని వికృతానందం పొందే సోషల్ మీడియా సైకోల ఐపీ అడ్రస్‌లను ట్రాక్ చేసి మరీ పట్టుకునేలా సరికొత్త సాంకేతికతను ఈ టాస్క్‌ఫోర్స్‌కు అనుసంధానించనున్నారు. 

 డిజిటల్ ప్రక్షాళన దిశగా ఆంధ్రప్రదేశ్! 

గత ఐదేళ్లుగా సోషల్ మీడియాను వేదికగా చేసుకుని సాగిన బూతుల సంస్కృతికి, మార్ఫింగ్ దందాలకు చెక్ పెట్టేందుకు కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఏపీ రాజకీయాల్లో మైలురాయిగా మారనుంది. వ్యవస్థలను, కుటుంబాలను టార్గెట్ చేస్తూ పెచ్చరిల్లిపోతున్న డిజిటల్ అరాచకత్వాన్ని తుడిచిపెట్టడానికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ రంగంలోకి దిగుతుండటంతో.. త్వరలోనే క్షేత్రస్థాయిలో దీని ఫలితాలు కనిపించనున్నాయి. సమాజంలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని, సోషల్ మీడియాలో పద్ధతిగా ప్రశ్నించే సంస్కృతిని కాపాడేందుకు ఈ  డిజిటల్ ప్రక్షాళన  ఎంతగానో దోహదపడుతుందని  భావిస్తున్నారు.