AP Cabinet Approves New Liquor Policy: ఏపీలో మందుబాబులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నాణ్యమైన మద్యం బ్రాండ్లు ఉంచాలని.. సగటు మద్యం ధర రూ.99 నుంచి అందుబాటులో ఉంచాలని రాష్ట్ర కేబినెట్ (AP Cabinet) నిర్ణయించింది. ఈ మేరకు నూతన మద్యం పాలసీకి బుధవారం ఆమోదం తెలిపింది. అక్టోబర్ 1 నుంచి ఈ పాలసీ అమల్లోకి రానుంది. సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన సుదీర్ఘంగా సాగిన భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంగా నామకరణం చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అటు, వాలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరణపైనా కేబినెట్‌లో చర్చించారు. గతేడాది ఆగస్టులోనే వాలంటీర్ల కాల పరిమితి ముగిసిందని.. ఏడాది క్రితమే వాలంటీర్లను జగన్ తొలగించారని మంత్రులు తెలిపారు.
2023లో వాలంటీర్ల పదవీ కాలం ముగిసినా రెన్యువల్ చేయలేదని చెప్పారు. తప్పుడు విధానాలు, దొంగ పద్ధతుల్లోనే జగన్ పాలన సాగించారని అన్నారు. వాలంటీర్ల పునరుద్ధరణపై మరింత సమాచారం తీసుకోవాలని సీఎం చంద్రబాబు మంత్రులకు సూచించారు.
గత ప్రభుత్వంలో సాక్షి పత్రిక కొనుగోళ్ల పేరిట జరిగిన అవకతవకలపై కేబినెట్‌లో చర్చించారు. ప్రభుత్వ ఖజానా నుంచి సాక్షి పత్రిక కొనుగోళ్ల కోసం రెండేళ్లలోనే రూ.205 కోట్లు ఖర్చు చేశారని మంత్రులు తెలిపారు. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా సాక్షికి జరిపిన చెల్లింపులపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. అలాగే, సచివాలయాలు, వాలంటీర్లకు దిన పత్రికల కొనుగోలుకు నెలనెలా ఇచ్చే రూ.200 రద్దు చేస్తూ నిర్ణయించారు.
మరిన్ని నిర్ణయాలు
- సీఎం చంద్రబాబు ప్రకటించిన వరద సాయం ప్యాకేజీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే దీపావళి నాటికి మహిళలకు కానుక ఇవ్వాలనే అంశంపైనా భేటీలో చర్చించారు.
- మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించే అంశంపైనా సీఎం మంత్రుల అభిప్రాయాలను తీసుకున్నారు. మహిళలకు ఏడాదికి 3 ఉచిత వంట గ్యాస్ సిలిండర్లను ఇచ్చే పథకంపై కూడా మంత్రులు చర్చించినట్లు తెలుస్తోంది.
- చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మంత్రి మండలిలో తీర్మానించారు. దీనిపై మంత్రివర్గం కేంద్రానికి సిఫార్సు చేసింది.
- పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం సీడబ్ల్యూసీ సూచనల మేరకు పాత ఏజెన్సీకి ఇవ్వాలని నిర్ణయం. ఒకే ఏజెన్సీకి పనులు కేటాయించడం వల్ల ఏమైనా సమస్యలు వస్తే ఏజెన్సీ బాధ్యత ఉంటుందని మంత్రివర్గం అభిప్రాయపడింది.
- ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ 'స్టెమీ' పథకం ప్రారంభం
- ఆధార్ తరహాలో విద్యార్థులకు 'అపార్' గుర్తింపు కార్డులు జారీ.
- హోంశాఖలో రూ.10 కోట్ల కార్పస్ ఫండ్‌తో కొత్త కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం.
- అలాగే, వాలంటీర్లను సచివాలయాల్లోని వివిధ శాఖల్లో కలిపేలా చర్యలు. వర్షాలతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు నిధుల విడుదలకు ఆమోదం. మొత్తం 18 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.