APBJP : ఆంధ్రప్రదేశ్‌లో మద్యం పాలసీ అక్రమాలపై సీబీఐ విచారణను తప్పనిసరిగా కోరుతామని ఏపీ బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి స్పష్టం చేశారు. ప్రతిరోజు మద్యం విక్రయాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అనధికారింగా వైసిపి నాయకుల జేబుల్లోకి భారీ మొత్తాలు వెళ్తున్నాయనే విషయాన్ని ప్రజలంతా గమనించాలని కోరారు. విజయవాడ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రధాని మోడీ ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పురందేశ్వరి మాట్లాడారు. ప.గో. జిల్లా నరసాపురంలో ప్రభుత్వ మద్యం దుకాణాన్ని గురువారం తాను తనిఖీ చేయగా, అక్రమాలు బయటపడ్డాయన్నారు. రూ.లక్ష వరకు ఆ సమయానికి విక్రయాలు జరిగితే.. అందులో డిజిటల్ చెల్లింపులు జరిపింది కేవలం రూ.700 మాత్రమేనని తమ పరిశీలనలో తేలిందని వివరించారు.
మద్యం స్కాంపై వరుసగా ఆరోపణలు చేస్తున్న పురందేశ్వరి
ఆంధ్రప్రదేశ్ లో మద్యం అమ్మకాల్లో భారీ స్కాం ఉందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన ఆమె... క్షేత్ర స్థాయికి వెళ్తున్నారు. నర్సాపురంలో ఓ మద్యం దుకాణానికి వెళ్లి ఆరా తీస్తే.. లక్ష రూపాయల మద్యం అమ్మకానికి ఏడు వందల రూపాయలకే బిల్లులు కనిపించాయి. దీంతో పాటు అది కల్తీ మద్యం అని.. దాని వల్ల చాలా మంది అనారోగ్యం పాలయ్యారని ఆస్పత్రికి కూడా వెళ్లి పరామర్శించారు.
రూ. వేల కోట్లు దారి మళ్లుతున్నాయన్న ఏపీ బీజేపీ ఆరోపణలు
రాష్ట్రంలోని మద్యం కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. లిక్కర్ బాండ్ల ద్వారా రాష్ట్రప్రభుత్వం రూ.10 వేల కోట్ల అప్పు తెచ్చింది. మద్యం తయారీ కంపెనీల నుంచి తాడేపల్లి ప్యాలెస్‌కు రూ.300-400 కోట్ల ముడుపులు అందుతున్నాయి. సీఎంగా బాధ్యతలు స్వీకరించాక… 2024 నాటికి మద్యం విక్రయాలను ఐదు నక్షత్రాల హోటళ్లకే పరిమితం చేసి, ఆ తర్వాతే ఓట్ల కోసం మీ వద్దకు వస్తానని జగన్ చెప్పారని కానీ ఇప్పుడు మాట మార్చారన్నారు. మద్యం తయారీ కంపెనీల యజమానులను బెదిరించి, అధికారపార్టీ ముఖ్యనేతలు వాటిని చేజిక్కించుకున్నారని ఆరోపిస్తున్నారు.
నిరుపేదల నిలువు దోపిడీ
లీటరు మద్యం రూ.15కు తయారవుతుంటే… రూ.600 నుంచి రూ.800 మధ్య విక్రయిస్తున్నారు. రూ.25వేల కోట్లు ఎక్కడికి పోతున్నాయి? గతంలో రాష్ట్రప్రభుత్వానికి మద్యం ద్వారా ఏడాదికి రూ.15 వేల కోట్ల ఆదాయం వస్తే వైకాపా పాలనలో ఇది రూ.32 వేల కోట్లకు పెరిగింది. రోజుకు 80 లక్షల మంది మద్యం తాగుతున్నారు. ఒక్కొక్కరు రూ.200 చొప్పున ఖర్చుపెడితే… రూ.160 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. నెలకు రూ.4,800 కోట్లు. ఏడాదికి రూ.57,600 కోట్లు. బడ్జెట్లో రూ.32 వేల కోట్లే ఆదాయంగా చూపిస్తున్నారు. మిగిలిన రూ.25వేల కోట్లు ఏమైంది.. ఎక్కడికెళ్తోంది? దీనిపై ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని పురందేశ్వరి డిమాండ్ చేస్తున్నారు.
ఈ వివరాలన్నింటితో కేంద్రానికి ఫిర్యాదు చేసి సీబీఐ విచారణ కోరుతామంటున్నారు.