AP BJP president Purandeshwari : ఈ నెల 22న రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి డిమాండ్ చేశారు. అయోధ్యలో రాముని విగ్రహ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా పలు రాష్ట్రాలు సెలవు ఇచ్చాయని తెలిపారు. ఏపీ ప్రభుత్వం మాత్రం ఎందుకు ఇవ్వడం లేదని ఆమె ప్రశ్నించారు. దేశంలో గొప్పగా జరగబోతోన్న ఈ వేడుకలకి యూపీ, గోవా, చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాలు, జనవరి 22 న అందరూ పండుగ జరుపుకోవాలని సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి.
రామ మందిరం ప్రారంభం భారతీయుల శతాబ్దాల కల, దశాబ్దాల పోరాటమని పేర్కొన్న పురంధేశ్వరి.. ఈ నెల 22వ తేదీన బాలరాముని విగ్రహ ప్రతిష్ట నిర్వహించబోతున్నారు. 21వ తేదీ వరకు మాత్రమే జగన్ ప్రభుత్వం సెలవులు ఇవ్వడం వెనక దురుద్దేశం ఉందని అర్థం అవుతుందని విమర్శించారు. 22వ తేదీన కూడా సెలవు ప్రకటించాల్సి ఉన్నా.. ఉద్దేశపూర్వకంగానే ఆరోజు సెలవు ఇవ్వలేదన్న ఆమె.. ఇప్పటికే ప్రైవేటు విద్యా సంస్థలు సెలవులు ప్రకటించాయని పురందేశ్వరి గుర్తుచేశారు.
స్కూళ్లకు సంక్రాంతి సెలవులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల కిందట నిర్ణయం తీసుకుంది. కి ఏపీలో స్కూళ్లు సంక్రాంతి సెలవుల అనంతరం జనవరి 19న ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, సెలవులను మరో మూడ్రోజులు పొడిగిస్తున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రంలో పాఠశాలలు జనవరి 22న పునఃప్రారంభం అవుతాయని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేశ్ కుమార్ పేర్కొన్నారు. టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తుల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. అయితే టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు అడిగితే సెలవులు ఇచ్చేస్తారా అన్న సందేహం చాలా మందికి వచ్చింది.
తల్లిదండ్రుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని సంక్రాంతి సెలవుల్ని పొడిగించినట్లు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. 'ఆడుదాం ఆంధ్రా' కోసం సెలవులు పొడిగించినట్లు తెలుస్తోంది. ఆడుదాం ఆంధ్రాలో భాగంగా జనవరి 10న ప్రారంభమైన మండల స్థాయి ఆటల పోటీలు జనవరి 20తో ముగియనున్నాయి. క్రికెట్, ఖోఖో, కబడ్డీ వంటి పోటీల్ని చాలా మండలాల్లో ప్రభుత్వ బడులకు అనుబంధంగా ఉన్న క్రీడా మైదానాల్లో, పాఠశాలల ఆవరణల్లో నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జనవరి 19 నుంచి బడులు తెరిస్తే పోటీలతోపాటు తరగతుల నిర్వహణకూ అవరోధమని అధికారులు భావించి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సెలవులు పొడిగింపునకు ప్రభుత్వ మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.
మరో వైపు ఏపీలో సంక్రాంతి సెలవులను ప్రభుత్వం పొడిగించగా.. తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు జనవరి 18 నుంచి తెరచుకున్నాయి. తెలంగాణలోని స్కూళ్లకు జనవరి 12 నుంచి 17 వరకు సెలవులను ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంటర్ కాలేజీలకు నాలుగురోజులు సెలవులు ఇవ్వగా జనవరి 17న కాలేజీలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు బీజేపీ ఇరవై రెండో తేదీ కూడా సెలవు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.