ఏపీ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణపై ఏపీ బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర బడ్జెట్ గొప్పదనాన్ని వివరిస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను విశ్లేషించేందుకు ప్రత్యేకంగా కార్యక్రమాలనుఏపీ బీజేపీ నిర్వహిస్తోంది. ‘5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది వేసిన కేంద్ర బడ్జెట్ .. ఆంధ్రప్రదేశ్‌ను ఆర్థిక సంక్షోభం వైపు నడిపిస్తున్న వైసీపీ ప్రభుత్వం’ అనే అంశంపై విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సదస్సు నిర్వహించారు. ఇందులో బీజేపీ నేతలు వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ తీరును తప్పు పట్టారు. ఏపీ బీజేపీలో ప్రముఖ నేతగా ఉన్న మాజీ సీఎస్ ఐవైఆర్ రామకృష్ణారావు
నిర్వహించిన సమావేశంలో ఐవైఆర్ కృష్ణారావు మాట్లాడారు. ఆదాయాలు చూసుకోకుండా డబ్బు ఖర్చు పెట్టిన వాళ్లు బాగుపడినట్లు ఎక్కడా లేదని అది వ్యక్తి అయినా, సంస్థ అయినా, ప్రభుత్వం అయినా ఇదే జరుగుతుందని తేల్చి చెప్పారు.
బడ్జెట్ ఎలా రూపొందించాలో కేంద్ర బడ్జెట్‌ను చూడాలని.. ఎలా రూపొందించకూడదో తెలుసుకోవాలంటే.. ఏపీ బడ్జెట్‌ను చూడాలన్నారు. ఏపీ ప్రభుత్వం బడ్జెట్‌లో రూ. 37 వేల కోట్లు అప్పుగా ప్రతిపాదించిందని కానీ ఇప్పటికే రూ. 57 వేల కోట్లు అప్పుగా తెచ్చి ఒక్క బటన్ నొక్కి పంచేశారని విమర్శించారు. అడ్డగోలుగా అప్పులు చేసి ప్రజలకు పంచుతామనే విధానానికి చరమగీతం పాడాల్సి ఉందన్నారు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలని కోరారు.ఆంధ్రప్రదేశ్ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అన్ని పార్టీలు బడ్జెట్ ఎన్నికల మేనిఫెస్టో ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను ఐవైఆర్ కోరారు. అప్పుడే విచ్చలవిడి తనాన్ని కట్టడి చేయగలమని అభిప్రాయపడ్డారు. సీఎం జగన్ తన సొంత డబ్బు తెచ్చి పంచడం లేదని ఐ ఈ భారం మొత్తం ఏపీ ప్రజలు మోయాల్సిందేనన్నారు.
ఏపీకి కేంద్రం పెద్ద ఎత్తున నిధులు ఇస్తోందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. 2015 -16 లో రూ. 27,990 కోట్ల నిధులిస్తే 2020-21 మూడు రెట్లు అధికంగా అంటే రూ. 77,538 కోట్లు కేంద్రం ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఆరేళ్లలో ఇన్ని నిధులు ఏ రాష్ట్రానికి ఇవ్వలేదన్నారు. ప్రత్యేక ప్యాకేజీ కింద రూ. 15 వేల కోట్ల రుణాన్ని కేంద్రం చెల్లిస్తోందని జీవీఎల్ నరసింహారావు చెప్పారు. చంద్రబాబు ఐదేళ్లలో రాజధానిని నిర్మించలేకపోయారని, తానొచ్చిన పూర్తి చేస్తానన్న జగన్.. అసలు రాజధానే లేకుండా చేశారంటూ సోము వీర్రాజు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో ఉన్న వనరులు, సముద్ర తీర ప్రాంతాలను వినియోగించుకుంటే రాష్ట్రాభివృద్ధి పరుగులు పెడుతుందని.. కానీ విభజన తర్వాత రాష్ట్రానికి దిశ, దశ లేకుండా పోయిందన్నారు.