ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు సురేష్ పై పోలీసు దాష్టీకాన్ని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ తీవ్రంగా ఖండించారు. ఇంతవరకు ఆ పోలీసులపై చర్యలు తీసుకోలేదని, దీనిపై రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేస్తామన్నారు.
సీఎం పర్యటనలో పోలీసులు అరాచకం..!
నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే అవినీతి, అక్రమాలపై సీఎం కు వివరించేందుకు భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకోవడం దారుణమని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ మండిపడ్డారు. కావలి ఎమ్మెల్యే అరాచకాలను వివరిస్తూ వినతిపత్రం కూడా సిద్దం చేసి ముఖ్యమంత్రి జగన్ కు ఇవ్వటానికి ప్రయత్నిస్తే పోలీసులు ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పర్యటన ప్రాంతానికి వెళ్లి సీఎంను కలిసే అవకాశం ఇవ్వాలని బీజేపీ నాయకులు పోలీసులను కోరారని, కుదరకపోతే అక్కడి నుంచి పంపించాలే గానీ.. పోలీసులే ఇష్టం వచ్చినట్లుగా బీజేపీ నేతలపై దాడి చేశారని ఆయన అన్నారు. సురేష్ ను రెండు కాళ్ళ మధ్య పెట్టి ఓ పోలీసు అధికారి చేసిన దాష్టీకాన్ని అందరూ చూశారని, బీజేపీ నేతలపై దాడికి పాల్పడిన పోలీసుల మీద వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సీఎం జగన్ స్పందించాలి....
బీసీలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పుకునే జగన్.. తనను కలిసేందుకు వచ్చిన వారిపై దాడి చేస్తే స్పందించరా అని బిట్ర శివన్నారాయణ ప్రశ్నించారు. పోలీసుల తీరుపై ఆంధ్రప్రదేశ్ డీజీపీని కలిసి ఆధారాలతో ఫిర్యాదు చేస్తామన్నారు. బీసీల అభ్యున్నతికి నిజాయతీగా పని చేసిన పార్టీ బీజేపీ మాత్రమేని, బీసీ కమిషన్ ద్వారా బీసీలకు మోడీ న్యాయం చేశారని చెప్పారు. సీఎం జగన్ వైఫల్యాలు, విధానాలపై ప్రజలే తిరగబడుతున్నారని, అందుకే రోడ్లపైకి వస్తే పరదాల చాటున జగన్ పర్యటనలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. జగన్ ప్రభుత్వం తీరుపై బీజేపీ మొదటి నుంచీ పోరాటాలను కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఆలయాలపై దాడులు చేసిన వారిని ఇంతవరకు శిక్షించలేదని, బీజేపీ నేతలపై దాడులు చేసి భయపెట్టాలంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. దాడి చేసిన డీఎస్పీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కొన్ని వర్గాల వారికే కొమ్ము కాసేలా జగన్ పాలన సాగుతుందని ఆరోపించారు. రాష్ట్రం ఏమైనా పర్వాలేదు.. నాకు ఓట్లు , కోట్లు కావాలనే విధంగా జగన్ తీరు ఉందని, కేంద్రం ఏపీలో  అమరావతి అభివృద్దికి నిధులు కేటాయించిందని, ప్రాజెక్టులు పనులు చేపట్టిందని తెలిపారు.
జగన్ పోలీసుల పై చర్యలు తీసుకుని బీసీ ఆత్మగౌరవం కాపాడాలన్నారు. భవిష్యత్ లో ఇటువంటి దాష్టికాలు జరగకుండా పోలీసులు నియంత్రించాలని సూచించారు.


చుక్కల భూములన్నీ వైసీపీ చేతుల్లోనే..!
రాష్ట్రంలో చుక్కలు భూములు అన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల చేతుల్లోనే ఉన్నాయని బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు రొంగల గోపి ఆరోపించారు. చట్టబద్దత కల్పించేలా నిర్ణయాలు ప్రజల కోసమే అన్నట్లుగా వైసీపీ ప్రచారం చేసుకుందని, కావలిలో అవినీతి, అక్రమాలపై సీఎంను కలిసేందుకు అనుమతి తీసుకోవటం తప్పా అని ప్రశ్నించారు. డీఎస్పీ బీజేపీ నేతల పట్ల సభ్య సమాజం సిగ్గుపడేలా, మానవత్వం లేకుండా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు కాళ్ళ మధ్య నేతల తలను పెట్టి దాడి చేయడమే కాకుండా, అక్రమంగా కేసులు పెట్టారని తెలిపారు. ఈనెల 13న పోలీసులపై ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎటువంటి చర్యలు లేవన్నారు. సీఎం, బీసీ మంత్రులు, డిజీపీ ఈ దారుణ ఘటనపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఏపీలో పోలీసు వ్యవస్థను దిగజార్చే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని, కొంతమంది పోలీసులు వైసీపీ కార్యకర్తలుగా పని చేస్తున్నారని మండిపడ్డారు.
బీసీ కమిషన్ కు జీరో బడ్జెట్ ఇచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదని విమర్శించారు. బీసీలపై దాడులు జరిగితే ఒక్క ఘటనలో కూడా చర్యలు తీసుకోలేదని, బీసీ సంక్షేమం కోసం ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మోసం చేశారన్నారు. ఏడాదికి 1500 కోట్లు ఇస్తానన్న జగన్ ఇప్పటి వరకు ఎంత ఇచ్చారో సమాధానం ఇవ్వాలన్నారు. బీసీ కార్పొరేషన్ కు కార్యాలయం లేదు.. నిధులు ఇవ్వరని,పదవులు మాత్రమే ఇచ్చి గొప్పలు చెప్పుకోవడం జగన్ కే చెల్లిందన్నారు. సొంత డబ్బుతో కార్పొరేషన్ చైర్మన్ లు, సభ్యులు కార్యకలాపాలు నడుపుతున్నారని, జగన్  ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రకటనలు మాత్రమే చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీసీ జనగణన చేయకుండా తీర్మానంతో తప్పుకోవడం ఎంతవరకు సబబని నిలదీశారు. బీసీలంతా ఐక్యం కావాలి.. మోసం చేసిన జగన్ కు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. వైసీపీ పాలనలో జరుగుతున్న అవినీతిపై గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఛార్జిషీటు ప్రకటిస్తున్నామన్నారు. ప్రజా క్షేత్రంలో తప్పకుండా అవినీతి వైసీపీ  పాలనను తరిమి కొడతామని వెల్లడించారు.