ఆంధ్రప్రదేశ్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంపై భారతీయ జనతా పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. జగనే సమస్య అయినప్పుడు సమస్య ఎవరికి చెప్పుకోవాలని సటైర్లు వేశారు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంతో ప్రయోజనం ఉండే పరిస్థితులు లేవన్నారు. 


వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలన తీరుపై సత్యకుమార్‌ తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ సర్కారు 'జగనన్నకు చెబుదాం' అనే కార్యక్రమాన్ని తీసుకురావడంపై విమర్శనాస్త్రాలు సంధించారు. జగనన్నకు చెబుదాం టోల్ ఫ్రీ నెంబర్‌కు డయల్ చేస్తే, జగన్ చెప్పే అబద్ధాలు మెసేజ్‌ల రూపంలో వస్తాయని సత్యకుమార్ తెలిపారు. కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేయడం తప్ప, సమస్యల పరిష్కారం ఉత్తిమాటేనని విమర్శించారు. జగనే అసలు సమస్య అయినప్పుడు జగనన్నకు చెబుదాం అనేది అర్థరహితమని అన్నారు.


ఛార్జ్ షీట్ ఉద్యమానికి పకడ్బందీ ఏర్పాట్లు...
ఛార్జిషీట్‌ల ఉద్యమానికి మైక్రోలెవల్ అభ్జర్వేషన్ కోసం ఏర్పాట్లు చేస్తున్నామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సొము వీర్రాజు అన్నారు. 5000వేల శక్తి కేంద్రాల్లో బిజెపి నేతల పర్యటనలు ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రప్రభుత్వం పై ఛార్జిషీట్ల ఉద్యమానికి గ్రామస్థాయిలో అభియోగాల నమోదుకు భారతీయ జనతాపార్టీ శ్రేణులు కదం తొక్కుతున్నాయని ఆయన చెప్పారు. ప్రాంతాల వారీగా సమస్యలను గుర్తించడంతో పాటు ఆధారాల సేకరణలో బిజెపి నాయకత్వం తలమునకలై ఉందన్నారు. 


ఇప్పటికే భారతీయ జనతా పార్టీ చార్జ్ షీట్‌ల కార్యక్రమంలో వేగం పెంచిందని, అందుకు అనుగుణమైన మైక్రోలెవెల్ అబ్జర్వేషన్ పెంచామని తెలిపారు సోమువీర్రాజు. ఇప్పటికే వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించి ఉద్యమాన్ని తీవ్రం చేశామన్నారు.  ఆయా జిల్లాల నాయకత్వాని, అసెంబ్లీ స్థాయి నాయకత్వానికి పని విభజన చేసినట్టు వివరించారు. గ్రామాల వారీగా అభియోగాల స్వీకరణకు ప్రజల వద్దకు నేరుగా వెళుతున్నారని చెప్పారు. 


శక్తి కేంద్రాల ఏర్పాటు..
శక్తి కేంద్రాలు అంటే నాలుగు పోలింగ్ కేంద్రాలకు ఒక శక్తి కేంద్రంగా బిజెపి పార్టీ కార్యక్రమం రూపొందించుకుంది. అందుకు అనుగుణంగా 5000 శక్తి కేంద్రాల్లో బిజెపి నేతలు పర్యటనలు నిర్వహించారు. విజయవాడ వన్ టౌన్ లో బిజెపి శ్రేణులు కాలనీల్లో పర్యటించి అభియోగాలు నమోదు చేశారు. ఈ సందర్భంగా కార్పోరేషన్ సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. శానిటేషన్‌కు సంబంధించిన ఫిర్యాదులు కూడా బిజెపి నాయకత్వానికి వచ్చాయి. ఉత్తరాంధ్ర, రాయల సీమ దక్షిణ కోస్తా ప్రాంతంలో కూడా అభియెగాలను స్వీకరించారు. అరసవల్లిలో కేంద్రం నిధులను దారి మళ్లించిన సంఘనలు ఉన్నాయని బిజెపి నేతలు ప్రకటించారు. నెల్లిమర్లలో అధికార పార్టీ వైసీపీ నేతలు అవినీతి చిట్టా బిజెపి నేతలకు అందిందని చెప్పారు. భీమవరం సమీపంలోని పాలకోడేరులో ఎస్సీ కాలనీల్లో పేరుకుపోయిన సమస్యల పై భారతీయ జనతా పార్టీ నాయకులు అభియోగాలు నమోదు చేశారు. ఉభయగోదావరి జిల్లాల్లో వ్యవసాయశాఖ, సివిల్ సప్లైయ్ అధికారుల వల్ల సమస్యలు ఉన్నాయని రైతాంగం భారతీయ జనతా పార్టీ నేతలు దృష్టికి తీసుకుని వచ్చాయి. రాయల సీమలో అన్నమయ్య డ్యాంకు సంబంధించిన సమస్య పై ఇప్పటికే బిజెపి కోర్టులో కేసు వేసింది. అదేవిధంగా బద్వేలు తదితర ప్రాంతాల్లో సమస్యల పై బిజెపి నేతలు అభియోగాలు నమోదు చేశారు.