AP BJP : బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ చేసిన వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పడేశాయి. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఏపీ పర్యటన ఉన్న సమయంలో సత్యకుమార్ వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. దీంతో ఏకంగా కేంద్రమంత్రి రంగంలోకి దిగి సత్యకుమార్ వ్యాఖ్యలను ఖండించారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ సత్యకుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని వైసీపీని తాము అడగలేదని సత్యకుమార్ వ్యాఖ్యానించారు.  ఈ కామెంట్స్ ను షేకావత్ తప్పుపట్టారు. ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని వైసీపీని తాము అడిగినట్టుగా కేంద్రమంత్రి షేకావత్ స్పష్టం చేశారు. ద్రౌపది ముర్ము నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనాలని సీఎం జగన్ కూడా ఆహ్వానించామన్నారు. అయితే కేబినెట్ మీటింగ్ వల్ల ఆయన హాజరుకాలేకపోయారని వైసీపీ నుంచి పార్లమెంటరీ నేతలు పాల్గొన్నారని గుర్తుచేశారు. సత్యకుమార్ మాటలతో పార్టీకి సంబంధం లేదన్నారు. ఆ కామెంట్స్ ఆయన వ్యక్తిగతం అని తేల్చేశారు. 


సత్యకుమార్ కామెంట్స్ 


విజయవాడలో ఆదివారం జరిగిన ఓ సమావేశంలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పాల్గొ్న్నారు. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు మీడియాకు వివరిస్తూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను మండిపడ్డారు. సెప్టెంబర్ 25 నుంచి ఏపీలో పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయాలా? లేదా అనే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. సీఎం జగన్ పై విమర్శలు చేస్తూ అభివృద్ది గురించి మాట్లాడే అర్హత వైసీపీ లేదన్నారు. వైసీపీ హయాంలో ఏపీలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. వైసీపీ ప్లీనరీలో మాత్రం ఎంతో గొప్పగా అభివృద్ధి చేస్తున్నట్టుగా చెప్పారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలకు ఖర్చు చేస్తున్న నిధులు 60 నుంచి 90 శాతం కేంద్రం నుంచే వస్తున్నాయన్నారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ఓటెయ్యాలని బీజేపీ ఎప్పుడూ వైసీపీని కోరలేదని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం అవ్వడంతో కేంద్ర నాయకత్వం రంగంలోకి దిగింది. వైసీపీ మద్దతు కోరామని చెప్పుకొచ్చారు. 


రేపు ఏపీకి ద్రౌపది ముర్ము 


ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము రేపు(మంగళవారం) ఏపీకి రానున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు  గన్నవరం  విమానాశ్రయానికి ఆమె చేరుకుంటారు. 3 గంటలకు  వైసీపీ ఎమ్మెల్యేలు,  ఎంపీలతో ద్రౌపది ముర్ము సమావేశం కానున్నారు. సాయంత్రం 5 గంటలకు సీఎం జగన్ ను ద్రౌపది ముర్ము కలవనున్నారు. ఏపీ నుంచి కర్ణాటక వెళ్లే  ముందు టీడీపీ ఎమ్మెల్యేలను కూడా ముర్ము కలవనున్నారు.