BJP Vs YSRCP :  ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, వైసీపీ మధ్య మరో వివాదం చోటు చేసుకుంది. విజయవాడలోని భవానీ నగర్‌లో ఉన్న పార్కుకు గతంలో అటల్ బిహారీ వాజ్ పేయి పేరు ఉండేది. అయితే  హఠాత్తుగా ఆ పేరును తొలగించి వైఎస్ఆర్ పార్క్ అని నామకరణం చేసి భారీగా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి జోగి రమేష్ సహా మాజీ మంత్రి వెల్లంపల్లి పలువురు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్కులో వైఎస్ఆర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలియడంతో బీజేపీ నేతలు భగ్గుమన్నారు.                                 





 


మహానుభావుల్ని అవమానించడం  మానసిక రోగం, ఆధునిక భారత దేశ నిర్మాతగా పేరు తెచ్చుకున్న మాజీ ప్రధాని వాజ్‌పేయిని   అవమానిస్తే దానివల్ల ఓక ఓటు కూడా పెరగదని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గతంలో భారతీయ జనతా పార్టీ నేతగా ఉండేవారు. ఆ సమయంలో ఆయన పార్కుకు వాజ్‌పేయి పరు పెట్టడానికి కృషి చేశారు. ఇప్పుడు ఆయన వైసీపీలో ఉండటంతో వాజ్ పేయి పేరును తొలగించి..  వైఎస్ఆరే్ పేరు పెట్టి.. ఆ పార్టీ అధినేత ప్రాపకం కోసం ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని విష్ణువర్ధన్ రెడ్డి కూడా గుర్తు చేశారు.  అన్నింటికీ పేర్లు పెట్టుకోవడం అభిమానించడం కాదు అవమానించడమేనన్నారు.                                              


వైఎస్ఆర్‌సీపీకీ ఈ పేర్ల పిచ్చి ఏమిటని.. విష్ణువర్దన్ రెడ్డి ప్రస్నించారు.  బోర్డులు మీద కాదు ప్రజల ప్రజల హృదయాల్లో పేర్లు ఉండాలన్నారు.  తక్షణం తప్పు దిద్దుకోవాలని డిమాండ్ చేశారు. వాజ్ పేయి పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో గతంలో వెల్లంపల్లి మాట్లాడిన మాటల వీడియోను పోస్ట్ చేశారు.                  


వైసీపీ ప్రభుత్వంలో కొత్తగా నిర్మించిన వాటికి కాకుండా పాత వాటికి పేర్లు మార్చేందుకు పోటీ పడుతోంది. ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరును కూడా వైఎస్ఆర్ హెల్త్ వర్శిటీ అని మార్చేశారు. అదే కాకుండా చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అన్ని పథకాలకూ పేర్లు పెడుతున్నారు. దీనిపై విపక్ష నేతల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.