Andhra BJP :  ప్రధానమంత్రి నరేంద్రమోదీ 9 ఏళ్ల పాలనపై నెల రోజుల పాటు నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాల్లో భాగంగా బీజేపీ అగ్రనేతలు ఏపీలో పర్యటించనున్నారు.  హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నడ్డా చెరో బహిరంగసభలో ప్రసంగించనున్నారు. హోంమంత్రి అమిత్ షా ఈ నెల ఎనిమిదో తేదీన విశాఖపట్నం రానున్నారు. విశాఖలో మోదీ ప్రభుత్వం సాధించిన తొమ్మిదేళ్ల విజయాలపై బహిరంగసభ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభలో అమిత్ షా ప్రసంగించనున్నారు. అలాగే పదో తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తిరుపతికి రానున్నారు. తిరుపతిలో పార్టీ నేతలు ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించనున్నారు.                        
 
ఆంధ్రప్రదేశ్  బీజేపీపై దృష్టి పెట్టాలని బీజేపీ అగ్రనేతలు నిర్ణయించుకున్నారని అందుకే ఇద్దరు అగ్రనేతలు మూడు రోజులగా ఏపీలో పర్యటిస్తున్నారని భావిస్తున్నారు. బీజేపీ అగ్రనాయకత్వం తెలంగాణ విషయంలో చాలా సమావేశాలు నిర్వహిస్తోంది కానీ..ఇంకా ఏపీ విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో వ్యూహాలు ఖరారు చేయడం లేదు. ఎన్నికలు ముంచుకు వస్తున్న సమయంలో బీజేపీతో పొత్తుల కోసం రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది. అంతా ఢిల్లీ స్థాయిలో ఏదో జరుగుతోందని చెబుతున్నారు కానీ రాష్ట్ర నేతలకు పెద్దగా సమాచారం ఉండటం లేదు. పొత్తుల విషయంలో హైకమాండ్ దే తుది నిర్ణయమని..  వారు ఏం చెబితే దాన్ని పాటిస్తామని రాష్ట్ర నేతలు అంటున్నారు. ఇప్పటికే తాము జనసేనతో మాత్రమే ఉన్నామంటున్నారు. 


ఏపీ బీజేపీ నేతలు పార్టీని బలోపేతం చేసుకునేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. హైకమాండ్ నిర్దేశించిన కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పూర్తి చేస్తున్నారు. గతంలో ఆరేడు వేల స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు నిర్వహించిన  బీజేపీ.. ఇటీవల ప్రజా చార్జిషీట్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పెద్ద ఎత్తున బీజేపీ ప్రభుత్వ విజయాలను కూడా ప్రచారం చేశారు. తాజాగా .. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టి 9 ఏళ్లయిన సందర్భంగా నవ వసంతాలు - నవ కుసుమాల పేరిట తొమ్మిది విజయాలను భారీ స్థాయిలో ప్రచారం  చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందు కోసం నెల రోజుల కార్యక్రమం నిర్వహిస్తున్నారు.                              


ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి నేతృత్వంలో గత నెల 30 వతేదీ నుంచి ఈ ప్రచారం ప్రారంభమయింది. జిల్లాల వారీగా బహింగసభలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో రెండు జిల్లాల బహిరంగసభలకు పార్టీ అగ్రనాయకత్వం వస్తూండటంతో.. బీజేపీలో ఉత్సాహం కనిపిస్తోంది.