Sunil BJP : ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు పొత్తుల రాజకీయాలు నడుస్తున్నాయి. ఎవరెవరు పొత్తులు పెట్టుకుంటున్నారు.. పెట్టుకోబోతున్నారన్న అంశంపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల పవన్ కల్యాణ్, చంద్రబాబు సమావేశం కావడంతో టీడీపీ , జనసేన కలిసి పోటీ చేస్తాయన్న అంచనాకు రాజకీయవర్గాలు వస్తున్నాయి. ఈ కూటమిలో బీజేపీ కూడా చేరుతుందని 2014 కాంబినేషన్ రిపీట్ అవుతుందని చెబుతున్నారు. ఈ ప్రచారం బీజేపీ హైకమాండ్ వరకూ చేరింది. దీంతో వారు క్లారిటీ ఇచ్చేశారు. తెలుగుదేశం పార్టీతో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తులు పెట్టుకునేది లేదని .. ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఏపీ కో-కన్వీనర్ సునీల్ ధియోధర్ తేల్చి చెప్పారు. ఈ అంశంపై ఢిల్లీలో ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడారు.
టీడీపీతో పొత్తులు పెట్టుకుని గతంలో నష్టపోయాం !
తెలుగుదేశం పార్టీతో తాము గతంలో పొత్తులు పెట్టుకున్నామని తీవ్రంగా నష్టపోయామని సునీల్ ధియోధర్ గుర్తు చేశారు. అయితే జనసేనతో మాత్రం పొత్తు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని చెప్పారు. పవన్ కల్యాణ్ రోడ్ మ్యాప్ వ్యవహారాన్ని తాము అంతర్గతంగా చర్చించుకుంటామని తెలిపారు. రోడ్డు మ్యాప్‌పై మీడియాతో పవన్ మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. విశాఖపట్నంలో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించి బీజేపీ నేతలు చాలా మంది జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో మాట్లాడారని చెప్పారు. వైసీపీ, టీడీపీలు రెండు దొంగ పార్టీలేనని విమర్శించారు. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ-జనసేన కూటమిని ప్రజలు భావిస్తున్నారని ఆయన చెప్పారు.
కన్నా ఇష్యూని సీరియస్‌గా తీసుకోవడం లేదు !
ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ వ్యవహారాన్ని తాము సీరియస్‌గా తీసుకోవడం లేదని సునీల్ ధియోధర్ ప్రకటించారు. కన్నా లక్ష్మీ నారాయణ కామెంట్స్‌పై సోము వీర్రాజు స్పందించారని.. అంతకు మించి తాను చెప్పేదేం లేదని అన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీరుపై కన్నా లక్ష్మినారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన తీరు వల్లే పార్టీ నష్టపోతోందని మండిపడ్డారు. ఆయనను ఏపీ బీజేపీ చీఫ్‌గా తొలగించాలన్న డిమాండ్ కూడా కన్నా వర్గీయులు చేశారు. పలువురు బీజేపీ సీనియర్లు అదే డిమాండ్ చేశారని.. అంతర్గతంగా పార్టీ హైకమాండ్‌పై ఒత్తిడి పెంచుతున్నారని చెబుతున్నారని చెబుతున్నారు. అయితే సునీల్ ధియోధర్ మాత్రం సోము వీర్రాజుకు మద్దతుగా నిలబడుతున్నారు.
జనసేనతో మాత్రం పొత్తు ఖాయమన్న బీజేపీ
టీడీపీతో కలవం కానీ.. ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేనతో కలిసి పోటీ చేస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం బీజేపీతో కటీఫ్ చెప్పినట్లుగా మాట్లాడుతున్నారు. తాను రోడు మ్యాప్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నానని పవన్ అన్నారు. రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రం మారబోతుందని అన్నారు. తనకు మోదీ, బీజేపీ అంటే గౌరవమని... అలాగని ఊడిగం చేయనని స్పష్టం చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఎలాంటి లాభం లేదని.. టీడీపీతో వెళ్తేనే వైఎస్ఆర్‌సీపీని ఓడించగలమని పవన్ అనుకుంటున్నారు. కానీ బీజేపీ మాత్రం పవన్ తమతోనే వస్తారని గట్టి నమ్మకంతో ఉంది.