AP Assembly : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రెండు కీలక తీర్మానాలకు ఆమోదం తెలిపింది. బోయ, వాల్మీకి కులాలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు, అలాగే దళిత క్రిస్టియన్లను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఏపీ అసెంబ్లీ తీర్మానాలు చేసింది. ఈ తీర్మానాలను కేంద్రానికి పంపుతున్నట్లు ప్రకటించారు సీఎం జగన్. పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ఈ రెండు తీర్మానాలు కేంద్రానికి పంపుతున్నామన్నారు.   పాదయాత్ర సమయంలో ఎస్టీల్లో చేర్చాలని బోయ, వాల్మీకి కులస్థులు కోరారన్నారు. ఎన్నికల టైంలో ఇచ్చిన హామీ మేరకు బోయ, వాల్మీకి కులస్థుల పరిస్థితులపై వన్ మ్యాన్ కమిషన్‌ ఏర్పాటుచేశామన్నారు. రాయలసీమ ప్రాంతంలో బోయ, వాల్మీకి కులాల ఆర్థిక, సామాజిక పరిస్థితులపై కమిషన్ ప్రభుత్వానికి నివేదిక అందించిందన్నారు. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేశామని సీఎం జగన్  తెలిపారు. ఎస్టీలు తనను గుండెల్లో పెట్టుకున్నారన్న సీఎం... వారిని కూడా అలాగే గుండెల్లో పెట్టుకుంటానన్నారు. ఈ తీర్మానంపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. ఏజెన్సీలో ఉన్న ఎస్టీ కులాలపై దీని ప్రభావం ఉండదన్నారు. దళిత క్రిస్టియన్లను ఎస్సీల జాబితాలో చేర్చేందుకు తీర్మానం చేశామన్నారు. దివంగత నేత వైఎస్‌ఆర్‌ హయాంలో ఈ తీర్మానం చేశారని గుర్తుచేశారు.  



" నా రాజకీయ ప్రయాణం మొదలయ్యాక ఎస్టీలు నన్ను ఎలా గుండెల్లో పెట్టుకున్నారో, నేను వారిని అలానే గుండెల్లో పెట్టుకుంటాను. వారికి అన్యాయం జరగకుండా చూస్తాం. దళిత క్రైస్తవులను ఎస్సీల్లో చేర్చాలని తీర్మానం చేస్తున్నాం. ఉమ్మడి ఏపీలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇలానే తీర్మానం చేశారు. మళ్లీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం తీర్మానం చేసింది. ఈ విషయంపై సుప్రీంకోర్టులో కేసు కూడా నడుస్తుంది. ఏపీ ప్రభుత్వం కూడా ఈ కేసులో ఇంప్లీడ్ అవుతుంది. ఒక దళితుడు ఇది వరకు తాను ఆచరిస్తున్న మతాన్ని విడిచి మరొక మతంలోకి వెళ్తే వారి సాంఘిక, ఆర్థిక, జీవన స్థితిగతుల్లో ఎలాంటి మార్పులురావు. మతం అనేది ఆ మనిషికి ఆ దేవుడికి మధ్య ఉన్న సంబంధం. మతం మార్పిడితో ఏ విధమైన నష్టం జరగదని తెలుసు. అందుకే దళిత క్రిస్టియన్లను ఎస్సీల్లో చేర్చాలని కోరుతూ తీర్మానాలు చేస్తూ కేంద్రానికి పంపిస్తున్నాం. అన్యాయం జరిగిన వాళ్లకు న్యాయం చేయాలనేది నా ప్రయత్నం. వాయిస్ లెస్ పీపుల్ కు వాయిస్ అవ్వాలని నిర్ణయించుకున్నాం " - సీఎం జగన్  


"ఈ నాలుగేళ్ల పాలనలో రెండు లక్షల కోట్ల నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమచేశాం. ఇంతకు ముందు చంద్రబాబు హయాంలో ఎందుకు అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నగదు వేయలేదు. ఆ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి. దోచుకో, పంచుకో, తినుకో అనే డీపీటీ స్కీ్మ్ ద్వారా టీడీపీ నేతలు దోచుకున్నారు. " - సీఎం జగన్