Annadata Sukhibhava Funds: ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు దీపావళి వేళ డబుల్ బొనాంజో తగలబోతోంది. ఆగస్టులో వచ్చినట్టుగానే ఈ అక్టోబర్‌లో కూడా ఇటు పీఎం కిసాన నిధులు, మరోవైపు కొత్తగా అమలులోకి వచ్చిన అన్నదాత సుఖీభవ నిధులు ఖాతాల్లో జమ కాబోతున్నాయని తెలుస్తోంది. జులైలో ఇవ్వాల్సిన పీఎం కిసాన్ నిధులు నెల ఆలస్యంగా ఆగస్టులో విడుదల చేశారు. అయితే ఈసారి మాత్రం ఆలస్యం చేయకూడదని కేంద్రం భావిస్తోంది. అందుకే అక్టోబర్‌లోనే 21వ విడత పీఎం కిసాన్ స్కీమ్ నిధులు రైతుల ఖాతాల్లో వేయనుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే పని చేయనుందని తెలుస్తోంది.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధితోపాటే అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేస్తామని గతంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఇప్పుడు అక్టోబర్‌లో ఆ నిధులు జమ అవుతాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అన్నదాత సుఖీభవ నిధులు కూడా విడుదల అవుతాయని తెలుస్తోంది. దీపావళికి ముందు అంటే అక్టోబర్ 18న ముహూర్తం ఫిక్స్ చేసినట్టు సమాచారం.
కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఏటా 14 వేల రూపాయలు ఇచ్చి ఆర్థిక తోడ్పాటు అందిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల కారణంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ఆలస్యంగా ప్రారంభించారు. గత నెల ఆగస్టు రెండో తేదీన నిధులు జమ చేశారు. 14 వేల రూపాయలను మూడు విడతలుగా జమ చేయనున్నట్టు ముందే ప్రకటించారు. అది కూడా పీఎం కిసాన్ తోపాటే వేస్తామన్నారు.
ఇప్పటికే ఆగస్టులో ఐదు వేల రూపాయల అన్నదాత సుఖీభవ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు మరో విడతకు సంబంధించిన నిధులు కూడా జమ చేసేందుకు సిద్ధమవుతోంది. పీఎం కిసాన్ 21వ కిస్తీ నిధులు జమ చేసినప్పుడే చేయాలని నిధులు సమకూరుస్తోంది. పీఎం కిసాన్ నిధులను దీపావళి కానుకగా జమ చేయడానికి కేంద్రం రెడీ అవుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం మరో ఐదు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో వేయనుంది.
ఇటు కేంద్రం పీఎం కిసాన్ నిధులతోపాటు, అటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్నదాత సుఖీభవ నిధులు కలుపుకొని ఈ దీపావళి సందర్భంగా ఒక్కో రైతు అకౌంట్‌లో 7వేల రూపాయలు జమ కానున్నాయి. అన్నదాత సుఖీభవ పథకం మొదటి విడత నిధులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాదర్శి నియోజకవర్గం తూర్పు వీరాయపాలెంలో ప్రారంభించారు. రైతులతో మాట్లాడారు. ఇప్పుడు రెండో విడత నిధుల జమ కార్యక్రమంలో ఎక్కడ పాల్గొంటారనేది ఇంకా తేలలేదు.
పీఎం కిసాన్ యోజన, అన్నదాత సుఖీభవ పథకం కలిపి యేటా ఇరవై వేల రూపాయలు రైతులకు లబ్ధి కలగనుంది. రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు ఇస్తే కేంద్రం ఆరు వేలు జమ చేస్తోంది. మొదటి విడతలో ఏడు వేలు జమ చేశారు. ఇప్పుడు రెండో విడతలో మరో ఏడు వేలు జమ చేయనున్నారు. మూడో విడతను ఫిబ్రవరిలో వేసే అవకాశం ఉంది. అప్పుడు ఆరువేల రూపాయలు వేస్తారు.