Nara Lokesh Slams CM Jagan: సీఎం జగన్ కు (CM Jagan) ఆర్టీసీ ఆస్తులపై ఉన్న శ్రద్ధ, బస్సుల కొనుగోలు, నిర్వహణపై లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) మండిపడ్డారు. భీమవరం (Bhimavaram) సమీపంలోని వీరవాసరంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి దూసుకెళ్లడంతో ధాన్యం వ్యాపారి మృతి చెందిన ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. 'విజయవాడ ఆర్టీసీ బస్టాండులో బస్సు ప్లాట్ ఫాంపైకి దూసుకెళ్లి ముగ్గురు అమాయకులు బలయ్యారు. ఈ దుర్ఘటన మరవక ముందే భీమవరం సమీపంలోని వీరవాసరంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి దూసుకెళ్లడంతో ధాన్యం వ్యాపారి మృతి చెందాడు. ఈ ప్రమాదంలో బైక్ తో సహా సదరు వ్యాపారి బస్సు కింద ఇరుక్కుపోగా దాదాపు గంట తర్వాత పొక్లెయిన్ సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. ప్రమాదానికి గురైన బస్సు బ్రేకుల్లో సమస్య ఉన్నట్లు డ్రైవర్లు ముందుగా చెప్పినా.. స్పేర్ పార్టులకు డబ్బుల్లేవని మరమ్మతులతో సరిపెట్టిన దివాలాకోరు ప్రభుత్వమిది. ఇది కచ్చితంగా సర్కారీ హత్యే.' అని లోకేశ్ ధ్వజమెత్తారు. ప్రభుత్వం మృతుడి కుటుంబానికి పరిహారం అందించాలని, ఆర్టీసీ గ్యారేజీల్లో మెయింటెనెన్స్‌కు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ జరిగింది
ప.గో జిల్లా వీరవాసరంలో శుక్రవారం అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి వాహనంతో సహా బస్సు కింద ఇరుక్కుపోయి మృతి చెందారు. దాదాపు గంట తర్వాత పొక్లెయిన్ సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. పాలకొల్లు నుంచి భీమవరం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వీరవాసరం తహసీల్దారు కార్యాలయం సమీపంలో అదుపు తప్పి కుడివైపు దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న బైక్ ను, పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి ఆగింది. ఈ ఘటనలో పాలకొల్లు మండలం తిల్లపూడి వాసి, ధాన్యం వ్యాపారి కాజ శ్రీనివాసరావు (52) అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాసరావుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రమాదానికి కారణమైన బస్సు భీమవరం డిపోకు చెందినది. బ్రేకుల్లో సమస్య ఉన్నట్లు గుర్తించిన డ్రైవర్లు అధికారులకు సమాచారం ఇవ్వగా కీలకమైన విడిభాగాలు మార్చకుండా రెండుసార్లు మరమ్మతులతో సరిపెట్టినట్లు సమాచారం. తాజాగా బ్రేకుల విడిభాగాలను సర్దుబాటు చేయగా, అవి విఫలమై ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
జగన్నాటకాలకు యువత బలి
సీఎం జగన్ ఆడే నాటకాలకు యువతి బలవుతోందని నారా లోకేశ్ మండిపడ్డారు. ఉద్యోగాల విషయంలో జగన్ మాయమాటలు నమ్మి రాష్ట్రంలో యువత మోసపోయిందన్నారు. 'ఏటా జనవరి 1నే జాబ్ క్యాలెండర్ అన్నారు.. ఇచ్చారా? ఏటా 2 లక్షలకుపైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ అన్నారు.. ప్రకటించారా?' అని లోకేశ్ ప్రశ్నించారు. ఉద్యోగాలు రాక.. ఉపాధి లేక యువత తీవ్ర ఆందోళనలో ఉందన్నారు. జగన్ పాలనలో టీచర్ పోస్టుల భర్తీకి ఒక్క ప్రకటనా రాలేదన్నారు. ఉద్యోగాలు రాలేదని యువత ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని లోకేశ్ కోరారు.
టీడీపీ - జనసేన మేనిఫెస్టో కమిటీ
టీడీపీ - జనసేన జేఏసీ ఉమ్మడి మేనిఫెస్టో కమిటీని మొత్తం ఆరుగురు సభ్యులతో ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, కొమ్మారెడ్డి పట్టాభి.. జనసేన నుంచి వరప్రసాద్, ముత్తా శశిధర్, శరత్ కమిటీలో ఉన్నారు. ఈ నెల 13న ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై ఈ కమిటీ భేటీ కానుంది.
Also Read: CM Jagan: 'మైనారిటీల అభివృద్ధికి పెద్దపీట' - సాధికారత చేతల్లో చూపించామన్న సీఎం జగన్