TTD Ghee Scam: టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
Tirumala Laddu Controversy: లడ్డూ కల్తీ నెయ్యి స్కాంలో ఈడీ బుధవారం దేశవ్యాప్తంగా దాడులు నిర్వహించింది. ఏఆర్ డైరీ సహా 3 ప్లాంట్లు, 15 ప్రాంతాల్లో సోదాలు చేసి రూ.45 కోట్ల ఆస్తుల గుట్టురట్టు చేసింది.

ED Hyderabad Raids on TTD Ghee Adulteration Fraud case: తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి కల్తీ స్కామ్‌కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దేశవ్యాప్తంగా దాడులు నిర్వహించింది. బుధవారం ఈడీ హైదరాబాద్ జోనల్ ఆఫీస్ ఆధ్వర్యంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో ఏకకాలంలో సోదాలు జరిగాయి. ఈ స్కామ్‌కు సంబంధించిన నిధుల మళ్లింపు, అక్రమ ఆస్తుల గుట్టును రట్టు చేస్తూ ఈడీ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.
దేశవ్యాప్తంగా ఈడీ మెరుపు దాడులు
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కుంభకోణంలో మనీ లాండరింగ్ కోణాన్ని వెలికితీసేందుకు ఈడీ అధికారులు బుధవారం ఉదయం నుంచే దూకుడు పెంచారు. దేశవ్యాప్తంగా మొత్తం 15 కీలక ప్రాంతాలలో ఈ సోదాలు జరిగాయి. అహిల్యానగర్, బికానెర్, డెహ్రాడూన్, ఢిల్లీ, దిండిగల్, గుంటూరు, ముంబై , రూర్కీ నగరాల్లో ఉన్న నిందితుల నివాసాలు, కార్యాలయాలపై ఈడీ అధికారులు ఏకకాలంలో పంజా విసిరారు. కోట్లాది మంది హిందువుల సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్న లడ్డూ ప్రసాదం నెయ్యి సరఫరాలో జరిగిన మహా మోసానికి సంబంధించి ఆధారాలను సేకరించడమే లక్ష్యంగా ఈ దాడులు సాగాయి.
నిందితుల ఇళ్లలో భారీగా నగదు, ఆస్తుల గుర్తింపు
ఈ సోదాల్లో స్కామ్‌కు పాల్పడిన ప్రధాన సూత్రధారులైన పోమిల్ జైన్, విపిన్ జైన్, రాజు రాజశేఖరన్, రాజేష్ మన్సుఖ్‌లాల్ చౌదరి, అపూర్వ వినయ్‌కాంత్ చౌదరి, మచింద్ర శాంతారామ్ లంకే, అజయ్ కుమార్ సుగంధ్, మహేష్ కుమార్ రోహిరా , ఆశిష్ అగర్వాల్‌కు చెందిన ఇళ్లు, ఆఫీసులను ఈడీ జల్లెడ పట్టింది. ఈ తనిఖీల్లో రూ. 60 లక్షల కరెన్సీ నగదును అధికారులు సీజ్ చేశారు. అంతేకాకుండా, ఈ కల్తీ నెయ్యి అక్రమ సంపాదన ద్వారా నిందితులు, వారి కుటుంబ సభ్యుల పేర్ల మీద కొనుగోలు చేసిన రూ. 45 కోట్లకు పైగా విలువైన స్థిరాస్తులు, వివిధ పెట్టుబడుల పత్రాలను ఈడీ స్వాధీనం చేసుకుంది.
డైరీ ప్లాంట్లు సీజ్ - బోగస్ కంపెనీల నెట్‌వర్క్
టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన ప్రధాన డైరీ కంపెనీల ప్లాంట్లపై ఈడీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. దిండిగల్‌లోని ఎ.ఆర్. డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ , అహిల్యానగర్‌లోని మల్గంగా మిల్క్ అండ్ ఆగ్రో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ , రూర్కీలోని భోలే బాబా ఆర్గానిక్ డెయిరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాంట్లలో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా లభించిన పలు నేరపూరిత పత్రాలను సీజ్ చేశారు. బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడానికి, కల్తీ సంపాదనను దాచడానికి నిందితులు పలు బోగస్ కంపెనీలను సృష్టించి, ఒక క్లిష్టమైన నెట్‌వర్క్ ద్వారా నకిలీ కొనుగోళ్లు, అమ్మకాల లావాదేవీలు జరిపినట్లు ఈడీ నిర్ధారించింది.
టీటీడీ అధికారులతో క్విడ్ ప్రో కో - పీఎంఎల్‌ఏ కేసు
గతంలో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA), 2002 కింద ఈ దర్యాప్తును అధికారికంగా ప్రారంభించింది. ఎ.ఆర్. డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకులు, కొంతమంది ముఠా సభ్యులు నాటి టీటీడీ అధికారులతో లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఈడీ పేర్కొంది. నమ్మకద్రోహం, చీటింగ్ , తీవ్రమైన లొసుగులతో కూడిన కల్తీ నెయ్యిని సరఫరా చేయడం ద్వారా శ్రీవారి ఆలయానికి కోట్లాది రూపాయల నష్టం చేకూర్చినట్లు దర్యాప్తులో తేలింది.
కల్తీ నెయ్యి సరఫరా ద్వారా సంపాదించిన పాపపు సొమ్మును నిందితులు వివిధ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ రంగంలోకి మళ్లించి, ఆ నిధుల అసలు మూలాలను దాచేందుకు తీవ్రంగా ప్రయత్నించారని ఈడీ స్పష్టం చేసింది. అయితే సాంకేతిక ఆధారాలతో ఈ అక్రమ నెట్‌వర్క్‌ను ఈడీ ఛేదించింది. ప్రస్తుతం ఈ కేసులో తదుపరి దర్యాప్తు అత్యంత వేగంగా కొనసాగుతోందని, మరికొద్ది రోజుల్లో ఈ స్కామ్‌తో సంబంధమున్న మరికొందరు పెద్ద తలకాయల పేర్లు , మరిన్ని అక్రమ ఆస్తుల వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని ఈడీ ప్రెస్ నోట్ ద్వారా స్పష్టమవుతోంది.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















