Breaking News Live: చిత్తూరు జిల్లాలో పెళ్లి బస్సు బోల్తా ... 27 మందికి తీవ్రగాయాలు
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
చిత్తూరు జిల్లా కురబలకోట మండలం దాదంవారి పల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు అదుపుతప్ప బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 27 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. బాధితులను హుటాహుటిన మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమించడంతో వారిని బెంగుళూరుకి తరలించారు. సింగమానుబురుజు నుంచి కాండ్లమడుగుకు పెళ్లికి వెళ్తోన్న గోల్డన్‌వ్యాలీ కాలేజీకి చెందిన బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదం అనంతరం బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై ముదివేడు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఏపీ సీఎస్ సమీర్ శర్మ పదవీకాలాన్ని కేంద్రం పొడింగించింది. సీఎస్‌గా సమీర్ శర్మకు పదవీకాలాన్ని మరో 6 నెలలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నెల 30తో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సమీర్ శర్మ పదవీకాలం ముగిస్తుంది. దీంతో 2022 మే 31 వరకు సీఎస్‌గా సమీర్ శర్మ బాధ్యతలు నిర్వహించనున్నారు. 6 నెలల పాటు సమీర్ శర్మ పదవీకాలం పొడిగించాలని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను ఆమోదిస్తూ యూనియన్ సెక్రటరీ ఉత్తర్వులను జారీచేశారు.
శ్రీశైలం ఆలయం వద్ద భక్తులకు పెను ప్రమాదం తప్పింది. ఆలయ దక్షిణ మాడ వీధి నుంచి ఉచిత దర్శనం క్యూలైన్ మీదకు విజయ పాల డైరీ లారీ దూసుకొచ్చింది. పాల లారీ బ్రేకులు ఫెయిలై భక్తుల మీదుకు దూసుకొచ్చింది. భక్తులు కేకలు వేయడంతో దేవస్థానం సిబ్బంది, సెక్యురిటీ అప్రమత్తై బండరాళ్లు అడ్డుపెట్టి లారీని ఆపారు. ప్రమాదం జరగకుండా ఆపిన సిబ్బంది, సెక్యూరిటీ గార్డులను దేవస్థానం ఈవో లవన్న అభినందించారు. అనంతరం సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లారీని పక్కకు తరలించారు.
తిరుమలలో ఆదివారం ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో ఘాట్ రోడ్డులలో టీటీడీ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. వర్షం తగ్గడంతో వాహన రాకపోకలకు అనుమతిస్తున్నారు. శ్రీవారి పాదాలు, పాపవినాశనం మార్గాలు మూసివేశారు. అక్కడక్కడా విరిగిపడిన వృక్షాలను టీటీడీ సిబ్బంది తొలగిస్తున్నారు.
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఓ రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. వివేకానంద నగర్‌లోని ఓ పెద్ద ఇంట్లో ఈ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. ఈ పార్టీలో మొత్తం 44 మంది యువకులతో పాటు ఇద్దరు హిజ్రాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెద్ద మొత్తంలో మద్యం బాటిళ్లు, హుక్కా పీల్చే పరికరాలను, కండోమ్‌లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిలో యువతులు లేకపోవడం చూస్తే.. వీరంతా హోమో సెక్సువల్స్ అయి ఉంటారని పోలీసులు వెల్లడించారు. ఈ యువకులంతా కలిసి ప్రతి వారాంతంలో ఇలా రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
సీఎం కేసీఆర్ అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో ఈ సమావేశం జరుగుతుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లు, యాసంగి పంటల సాగుపై కేబినెట్‌లో చర్చించనున్నారు. కరోనా పరిస్థితులు సహా ఇతర అంశాలపైనా చర్చించనున్నారు.
హైదరాబాద్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. కొండాపూర్ గౌతమి ఎన్‌క్లేవ్ అపార్ట్‌మెంట్‌లో సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తూ ఇద్దరు కూలీలు మరణించారు. ఇద్దరు కూలీలు సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేసేందుకు దిగగా.. విషవాయువులు పీల్చడం వల్లనో, లేదా ఊపిరాడక పోవడంతోనే ఇద్దరు కూలీలు చనిపోయారు. కూలీల స్వస్థల నల్లొండ జిల్లా దేవరకొండలోని గాజీనగర్ వాసులుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
హుజూరాబాద్ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత సీఎం కేసీఆర్‌లో అసహనం పెరిగిపోయిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. ఏడేళ్ల నుంచి తెలంగాణ ధాన్యాన్ని కేంద్రం పూర్తిగా కొంటుందని చెప్పుకొచ్చారు.
ఎన్టీఆర్ పార్క్ ముందు కారు బీభత్సం రేపింది. అతివేగంగా వచ్చిన కారు ట్యాంక్ బండ్‌లోకి దూసుకెళ్లింది. హుస్సేన్ సాగర్ నీటిలో పడిపోయింది. ఆ సమయంలో కారులో ఉన్న ముగ్గురు యువకులకు స్వల్ప గాయాలు అయ్యాయి. వీరిని ఖైరతాబాద్ కు చెందిన నితిన్, సాత్విక్, కార్తీక్‌గా పోలీసులు గుర్తించారు. నాలుగు రోజుల క్రితమే వీరు ఈ కారు కొన్నారు. ఖైరతాబాద్ నుంచి అఫ్జల్ గంజ్‌లో టిఫిన్ చేయడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్షతగాత్రులను సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించారు.
Background
ప్రముఖ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని.. రెండు రోజుల క్రితం ఊపిరితిత్తులతో నిమ్ము చేరడంతో ఆస్పత్రిలో చేర్చినట్లుగా కిమ్స్ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయన్ని ఐసీయూలో ఉంచి వైద్య బృందం పర్యవేక్షిస్తోందని వెల్లడించారు. గత 24 గంటలుగా ఆయన పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. ఈ విషయమై సిరివెన్నెల తనయుడు యోగి స్పందించారు. ‘‘నాన్నగారు క్షేమంగానే ఉన్నారు. కంగారు పడాల్సిన అవసరం లేదు’’ అని ఆయన పేర్కొన్నారు.
నేడు కరోనా కొత్త వేరియంట్‌పై రివ్యూ
కరోనా కొత్త రకం వైరస్ ఒమిక్రాన్ వ్యాప్తిపై ఆందోళన వేళ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. ముందు జాగ్రత్తలు చేపట్టాలని, ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దని స్పష్టం చేసింది. దీంతో మంత్రి హరీశ్ రావు ఆదివారం ప్రత్యేకంగా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్, వైద్య విద్య డైరెక్టర్, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పరిస్థితి, కొత్త వేరియెంట్‌కు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భవిష్యత్ వ్యూహాలు, సన్నద్ధతపై చర్చించనున్నారు.
బైక్‌ను తగలబెట్టుకున్న వ్యక్తి
ట్రాఫిక్ పోలీసులు తరచూ చలాన్లు వేస్తున్నారని ఆగ్రహంతో ఓ వ్యక్తి ఏకంగా తన బైక్‌ను తగలబెట్టుకున్నాడు. ఆదిలాబాద్‌లోని ఖానాపూర్‌కు చెందిన ఫరీద్ మక్బుల్ అనే వ్యక్తి క్షణికావేశంతో ఈ పని చేశాడు. కిసాన్ చౌక్ మీదుగా బైక్‌పై వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అదే సమయంలో కిసాన్ చౌక్ వద్ద వాహనాలను ఆపుతున్న ట్రాఫిక్ పోలీసులు అతడిని నిలిపి పెండింగ్ చలానాలు చెల్లించాలని సూచించారు. దీంతో అతను ఆవేశంతో తన బైక్ లోని పెట్రోల్ తీసి అదే బైక్‌పై పోసి నిప్పంటించాడు. అక్కడున్న పోలీసులు వాహనంపై నీళ్లు పోసి మంటలు ఆర్పేశారు.
బంగారం ధరలు..
బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ మార్కెట్‌లో రూ.45,050 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం (99.99 స్వచ్ఛత) ధర ప్రస్తుతం రూ.49,150 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.67,900గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి. ఇక విజయవాడలోనూ పసిడి ధర కాస్త పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.45,050 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,150గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.67,900గా ఉంది. ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,050 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,150గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.67,900 గా ఉంది.
- - - - - - - - - Advertisement - - - - - - - - -