Telangana Weather Today: అమరావతి/ హైదరాబాద్: నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలపై ప్రభావం చూపుతోంది. అల్పపీడనం ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. భారీ వర్షాల ముప్పు పొంచి ఉన్న జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరాల వైపు పయనించిన అల్పపీడనం నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతోందని వాతావరణ శాఖ పేర్కొంది. 

పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర నైరుతి బంగాళాఖాత ప్రాంతాలైన ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి సంబంధించిన ఉపరితల ఆవర్తనం సగటున సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. డిసెంబర్ 24 వరకు ఏపీ, తమిళనాడులో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని కలెక్టర్లు, ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు డిసెంబర్ 26 వరకు సముద్రంలో వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. తీరం వెంట గంటకు 55 కి.మీ అంతకంటే వేగంతో గాలులు వీస్తున్నాయి. ఏపీలోని పోర్టులకు మూడో ప్రమాద ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

 

నేడు ఈ జిల్లాల్లో వర్షాలు, ఎల్లో వార్నింగ్

అల్పపీడనం ప్రభావంతో ఏపీలో మంగళవారం నాడు (డిసెంబర్ 24న) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్,  ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లోని కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ కూర్మనాథ్ హెచ్చరించారు. వీటితో పాటు రాయలసీమ జిల్లాలైన  వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో రెండు, మూడు ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు.  

తెలంగాణలో పొడి వాతావరణం, ఉదయం పొగమంచుతో చలి
బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ప్రభావం తెలంగాణపై ఏమాత్రం లేదు. రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉదయం వేళ కొన్ని జిల్లా్ల్లో పొగమంచు ఏర్పడుతుందని, చలి నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమే ఉంటుంది కానీ వర్షం పడే అవకాశాలు చాలా తక్కువ. నగరంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా దాదాపు 29 డిగ్రీలు, 19 డిగ్రీల మేర నమోదు అవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు దిశ, ఆగ్నేయ దిశ నుంచి గంటలకు 6 నుంచి 8 కి.మీ వేగంతో గాలులు వీచనున్నాయి.

Also Read: Telangana VRO System: తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం, ఉత్తర్వులు జారీ

నెం ఏరియా గరిష్ట ఉష్ణోగ్రత కనిష్ట ఉష్ణోగ్రత
1 ఆదిలాబాద్ 29.8 13.5
2 భద్రాచలం  32 20.2
3 హకీంపేట్  28.7 16.4
4 దుండిగల్   29.2 17.3
5 హన్మకొండ 31 18.5
6 హైదరాబాద్  28.6 19.3
7 ఖమ్మం  32.2 20.4
8 మహబూబ్ నగర్  29.4 20.2
9 మెదక్   29.3 16.6
10 నల్గొండ   29.5 20
11 నిజామాబాద్  31.8 18.4
12 రామగుండం  30 16.6
13 హయత్ నగర్ 28 17