Gade Sai Krishna Missing Case Vijayawada: ఇంతకీ గాదె సాయికృష్ణ ఏమయ్యారు? అంబటి రాంబాబు చెప్పినట్లుగా లాకప్ డెత్ చేశారా?
Krishna Lanka: విజయవాడ రౌడీషీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు సంచలనం రేపుతోంది. పోలీసులే కొట్టి చంపేసి దహనం చేశారని వైసీపీ నేత అంబటి ఆరోపిస్తున్నారు. జూన్ 29 లోగా హాజరుపరచాలని హైకోర్టు ఆదేశించింది.

Sai Krishna Missing Case: విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న తర్వాత అతను ఏమయ్యాడో తెలియకపోవడం, నెల రోజులుగా ఆచూకీ లభించకపోవడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. అసలు సాయికృష్ణ ఎవరు? అతను నేరస్థుడా, కాదా? అన్నది పక్కనబెడితే.. రక్షణ కల్పించాల్సిన పోలీసుల కస్టడీలోకి వెళ్లిన తర్వాత ఒక పౌరుడు కనుమరుగు కావడం సంచలనంగా మారింది.
మార్కాపురంలో అరెస్ట్.. ఆ తర్వాత మాయం!
విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణపై గతంలో కొన్ని కేసులు ఉండటంతో పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేశారు. అయితే పోలీసుల వేధింపులు తట్టుకోలేక అతను ప్రకాశం జిల్లా మార్కాపురానికి వలస వెళ్లి కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. కాగా, పాత కేసు విషయమై మే 9, 2026 న విజయవాడ కృష్ణలంకకు చెందిన ఇద్దరు పోలీసులు మార్కాపురం వెళ్లి సాయికృష్ణను అదుపులోకి తీసుకున్నారు. అలా పోలీసులు తీసుకెళ్లిన సాయికృష్ణ మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. అతన్ని ఏ కోర్టులోనూ హాజరుపరచకపోవడంతో కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది.
సీఐ వ్యాఖ్యలపై తల్లి కన్నీరు!
తన కొడుకు ఆచూకీ కోసం తల్లి గాదె విజయలక్ష్మి నెల రోజులుగా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతోంది. ఈ క్రమంలో కృష్ణలంక మాజీ సీఐ నాగరాజు తనతో అత్యంత క్రూరంగా మాట్లాడారని ఆమె ఆరోపిస్తోంది. నీ కొడుకు లేడనుకో.. చనిపోయాడనుకో అంటూ సీఐ తనతో అన్నట్లు ఆమె మీడియా ముందు కన్నీరు పెట్టుకుంది. నా కొడుకు బ్రతికి ఉంటే నా ముందే నిలబెట్టండి.. ఒకవేళ పోలీసులు చంపేసి ఉంటే కనీసం వాడి శవాన్ని, లేదంటే వాడి బూడిదనైనా నాకు ఇవ్వండి అంటూ ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చంపేసి, శ్మశానంలో తగలబెట్టేశారు - మాజీ మంత్రి అంబటి ఆరోపణలు
ఈ వ్యవహారంపై వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి సంచలన ఆరోపణలు చేశారు. తనకు ఉన్న నమ్మకమైన సమాచారం ప్రకారం.. పోలీసులు సాయికృష్ణను థర్డ్ డిగ్రీ ఉపయోగించి తీవ్రంగా కొట్టి లాకప్ డెత్ చేశారని ఆరోపించారు. ఆర్ఎంపితో కట్టుకట్టించి, కాలిగోళ్లు పీకేసి చిత్రహింసలు పెట్టారని, అతను చనిపోయాక ఎలాంటి ఆధారాలు దొరక్కుండా శవాన్ని కృష్ణలంక శ్మశాన వాటికకు తీసుకెళ్లి గుట్టుచప్పుడు కాకుండా దహనం చేసేశారని అంబటి పేర్కొన్నారు. బూడిద కూడా మిగలకుండా ఆధారాలన్నీ మాయం చేశారని ఆరోపించారు.
జూన్ 29 లోగా హాజరుపర్చాలన్న హైకోర్టు
పోలీసుల తీరుపై నిరాశ చెందిన బాధితుడి కుటుంబ సభ్యులు, బెజవాడ బార్ అసోసియేషన్ సాయంతో ఏపీ హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సాయికృష్ణ ఎక్కడ ఉన్నాడో తమకు తెలియదని, గాలింపు చర్యలు చేపడుతున్నామని ఏజీపీ కోర్టుకు తెలపగా.. హైకోర్టు సంతృప్తి చెందలేదు. జూన్ 29 లోగా సాయికృష్ణను కచ్చితంగా కోర్టు ముందు భౌతికంగా హాజరుపరచాలని డివిజన్ బెంచ్ పోలీసులను గట్టిగా ఆదేశించింది.
యాక్షన్ లోకి సీపీ.. సీఐ నాగరాజు వీఆర్‌కు బదిలీ!
కోర్టు ఆదేశాలు, రాష్ట్రవ్యాప్తంగా వస్తున్న ఒత్తిడితో ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ అలర్ట్ అయ్యింది. ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక సీఐ నాగరాజును వెంటనే వేకెంట్ రిజర్వ్ కు బదిలీ చేస్తూ సీపీ రాజశేఖర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో మురళీకృష్ణను కొత్త సీఐగా నియమించారు. జూన్ 29 నాటికి పోలీసులు సాయికృష్ణను కోర్టు ముందు ప్రవేశపెడితే అంబటి రాంబాబు వ్యాఖ్యలు అబద్ధం అవుతాయి. ఒకవేళ ప్రవేశపెట్టలేకపోతే మాత్రం, ఇది ఖచ్చితంగా పోలీసుల అరాచకత్వానికి పరాకాష్టగా నిలిచే పెద్ద లాకప్ డెత్ కేసుగా మారడం ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















