Chandrababu AI Summit: ఏఐ రంగంలో ఆంధ్రప్రదేశ్ నవశకం - ఢిల్లీ సమ్మిట్‌లో చంద్రబాబు విజన్
Delhi AI Summit: ఢిల్లీ ఏఐ సమ్మిట్ లో చంద్రబాబు పాల్గొన్నారు. పలు సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకున్నారు.

Chandrababu Naidu makes key agreements at AI Summit: ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. పలు కీలక ఒప్పందాలు చేసుకున్నారు.
ఏపీని ఏఐ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం
ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ కృత్రిమ మేధ కేంద్రంగా మార్చేందుకు తన ప్రణాళికలను వివరించారు. రాష్ట్రాన్ని సాంకేతిక హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఆయన పలు అంతర్జాతీయ ఐటీ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ పర్యటనలో రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడేలా ఏడు కీలక ఒప్పందాలను కుదుర్చుకున్నారు.
యువతకు భారీ నైపుణ్యాభివృద్ధి – ఐబీఎంతో ఒప్పందం
ఈ సమ్మిట్‌లో కుదిరిన అత్యంత కీలకమైన ఒప్పందాల్లో ఐబీఎమ్ సంస్థతో కుదిరిన ఒప్పందం ఒకటి. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని సుమారు 10 లక్షల మంది యువతకు ఏఐ, క్వాంటం టెక్నాలజీ, , సైబర్ సెక్యూరిటీ వంటి అత్యాధునిక రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఇది రాష్ట్ర యువతకు అంతర్జాతీయ స్థాయి ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.
విద్య, పరిశోధన రంగాల్లో విప్లవాత్మక మార్పులు
విద్యార్థుల కోసం ఏఐ ట్యూటర్ ను రూపొందించేందుకు ఐఐటీ మద్రాస్‌తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అలాగే, క్వాంటం ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు కోసం ఎన్‌ఐఈఎల్‌ఐటీ తోనూ, క్వాంటం సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కోసం యూనిసీసీ సంస్థతోనూ ఎంఓయూలు కుదిరాయి. వీటితో పాటు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఎన్విడియా సంస్థ భాగస్వామ్యంతో రాష్ట్రంలో ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయబోతున్నట్లు సీఎం ప్రకటించారు.
వరల్డ్ ఎకనామిక్ ఫోరం రౌండ్ టేబుల్‌లో ప్రసంగం
ఏఐ ద్వారా పోటీతత్వం అనే అంశంపై వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు. ఏఐ అనేది కేవలం సాంకేతికత మాత్రమే కాదని, అది సామాన్యుల జీవితాల్లో మార్పు తీసుకువచ్చే సాధనమని ఆయన పేర్కొన్నారు. గతంలో కంప్యూటర్ విప్లవాన్ని ఎలాగైతే అందిపుచ్చుకున్నామో, ఇప్పుడు ఏఐ విప్లవంలోనూ ఆంధ్రప్రదేశ్ ముందుంటుంది అని ఆయన ఉద్ఘాటించారు. పాలనలో పారదర్శకత కోసం ఏఐని ఉపయోగిస్తామని తెలిపారు.
ఢిల్లీలో జరుగుతోన్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ కంప్యూటింగ్ సెంటర్ డైరెక్టర్ సమీర్ చౌహాన్‌తో భేటీ అయ్యారు. అనంతరం UNICCతో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.… pic.twitter.com/6rzIhuyheO
— Telugu Desam Party (@JaiTDP) February 20, 2026
పారిశ్రామిక దిగ్గజాలతో కీలక భేటీలు
సమ్మిట్ సందర్భంగా చంద్రబాబు అడోబ్ సీఈఓ శాంతనూ నారాయణ్, ఆటోడెస్క్ ప్రతినిధులు , యునైటెడ్ కింగ్‌డమ్ డెలిగేషన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణాన్ని వివరిస్తూ, అమరావతిని ఏఐ సిటీ గా అభివృద్ధి చేసేందుకు వారి సహకారాన్ని కోరారు.























