Jonnagiri country largest private gold mine: భారతదేశం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారు వినియోగదారు అయినప్పటికీ, మన దేశీయ ఉత్పత్తి చాలా తక్కువగా ఉంది. ఈ లోటును భర్తీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వేదికగా ఒక చారిత్రాత్మక అడుగు పడబోతోంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి, ఎర్రగుడి, పగిడిరాయి గ్రామాల్లో విస్తరించి ఉన్న ఈ గని, భారతదేశపు మొట్టమొదటి భారీ ప్రైవేట్ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టుగా అవతరించింది.
ప్రాజెక్టు నిర్వహిస్తున్న ప్రైవేటు సంస్థ
ఈ ప్రాజెక్టును జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (GMSI) చేపట్టింది. ఇందులో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లో లిస్టెడ్ కంపెనీ అయిన డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ (DGML) కీలక భాగస్వామిగా ఉంది. 2025 జూన్-జూలై నాటికి అవసరమైన పర్యావరణ అనుమతులు (EC) పొందిన ఈ ప్రాజెక్టు, ఇప్పటికే ట్రయల్ రన్ ప్రారంభించింది. నవంబర్ 2025 నాటికి పూర్తిస్థాయి వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఉత్పత్తి సామర్థ్యం 750 కిలోలు
ప్రారంభ దశలో ఏటా సుమారు 750 కిలోల నుంచి 900 కిలోల శుద్ధి చేసిన బంగారాన్ని ఉత్పత్తి చేయాలని భావిస్తున్నారు. రాబోయే 2-3 ఏళ్లలో ఈ సామర్థ్యాన్ని ఏటా 1 టన్నుకు పెంచే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా మొదటి ఏడాదిలోనే దాదాపు 300 నుంచి 350 కోట్ల రూపాయల ఆదాయం సమకూరవచ్చని అంచనా. ప్రస్తుతం భారత్ ఏటా కేవలం 1.5 టన్నుల బంగారాన్ని మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. జొన్నగిరి గని అందుబాటులోకి వస్తే దేశీయ ఉత్పత్తి దాదాపు రెట్టింపు అవుతుంది.
ఆధునిక సాంకేతికత
ఈ ప్రాజెక్టు సక్సెస్ వెనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వేగవంతమైన అనుమతులు , మౌలిక సదుపాయాల కల్పన ప్రధాన పాత్ర పోషించాయి. ఓపెన్ పిట్ మైనింగ్ ద్ధతిలో అత్యాధునిక సాంకేతికతను వాడుతూ, పర్యావరణ నియమాలను పాటిస్తూ ఈ తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ గని సుమారు 15 ఏళ్ల పాటు నిరంతరంగా బంగారాన్ని ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
స్వయం సమృద్ధి
ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికంగా సుమారు 300 మందికి ప్రత్యక్షంగా, మరో 300 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. అంతేకాకుండా, గని చుట్టుపక్కల గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్య సౌకర్యాలను అభివృద్ధి చేసేందుకు నిర్వాహక సంస్థ కృషి చేస్తోంది. అతిపెద్ద దిగుమతి వస్తువుగా ఉన్న బంగారం విషయంలో భారతదేశం స్వయం సమృద్ధి దిశగా సాగడానికి జొన్నగిరి ప్రాజెక్టు ఒక దిక్సూచిగా నిలవనుంది.
