Andhra Pradesh CM Chandrababu on Thalliki Vandanam Scheme | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు, విద్యార్థులకు శుభవార్త అందించింది. మే నెలలోనే రైతులకు అన్నదాత సుఖీభవ ప్రారంభిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. విద్యార్థులకు ఈ ఏడాది స్కూల్ ప్రారంభానికి ముందే తల్లికి వందనం కింద పదిహేను వేల చొప్పున తల్లుల ఖాతాల్లో నగదు విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. సామాజిక న్యాయం పాటిస్తూనే త్వరలోనే మిగిలిన నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు.

టిడిపి ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలతో ఏపీ సీఎం చంద్రబాబు ఆదివారం నాడు టెలికాన్ఫెరెన్స్ లో మాట్లాడారు. రాజధాని అమరావతి (Amaravati) పునర్ నిర్మాణ కార్యక్రమం మోడీ చేతుల మీదుగా జరగడంతో ప్రపంచం దృష్టి మన మీదకు మళ్ళీందన్నారు. ఈ జూన్ 12వ తేదీకి ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతుంది. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కాలంలో చేసిన అభివృద్ధిని సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ నేతకు చంద్రబాబు సూచించారు.

రాష్ట్రంలో ఇదివరకే దాదాపు మెజార్టీ కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లు పదవులు భర్తీ చేసాం. మిగిలిన నామినేటెడ్ పోస్టులను సైతం సామాజిక న్యాయం పాటిస్తూ భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఏపీలోనూ గుజరాత్ మోడల్ అమలవ్వాలి. రాష్ట్రం, కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఉండటంతో గుజరాత్ అభివృద్ధి చెందుతోందని, ఏపీలోనూ అదే తీరుగా అభివృద్ధిలో పరుగులు పెట్టాలన్నారు. ఏడాది కాలంలోనే ప్రజలకు పాలనలో మార్పు చూపించాం, ఇటు పార్టీకి సైతం అంతే ప్రాధాన్యం ఇచ్చామన్నారు చంద్రబాబు.

జగన్ ఇలాకాలో పసుపు పండుగకడపలో మే 27వ తేదీ నుంచి 29 వరకు జరగనున్న మహానాడు కోసం 18వ తేదీ నాటికి అన్ని కమిటీలు వేయాలని సూచించారు. మహానాడు పూర్తయిన తర్వాత రాష్ట్ర స్థాయి కమిటీలు వేస్తామని నేతలకు చంద్రబాబు వివరించారు. ఒకటో తేదీన పింఛన్లు అందజేస్తున్నామని, నిధులు తీసుకొచ్చి 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలా సర్కార్ పనిచేస్తుంది. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశామని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు చంద్రబాబు దిశ నిర్దేశం చేశారు. దీపం2 పథకం కింద రాష్ట్రంలో కోటి మంది లబ్ధిదారులకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు తో పాటూ మరెన్నో ఫంక్షన్లు కార్యక్రమాలు చేయబడుతున్నామని ప్రజలకు తీసుకెళ్లాలన్నారు.