Andhra Pradesh News: నిరుపేదలకు గుడ్‌న్యూస్.. లక్ష టిడ్కో ఇళ్లు పంపిణీ చేయనున్న ఏపీ ప్రభుత్వం
AP TIDCO Houses | ఏపీలో నిరుపేదల సొంతింటి కల సాకారం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉగాది నాటికి లక్ష టిడ్కో ఇళ్లు పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేయాలి చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది.

AP Housing Scheme | అమరావతి: రాష్ట్రంలోని నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఉగాది పండుగ నాటికి లక్ష టిడ్కో (TIDCO) గృహాలను లబ్ధిదారులకు అందించేందుకు సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ గృహప్రవేశాల కార్యక్రమంలో భాగంగా మొత్తం 3 విభాగాల్లో ఇళ్లను పంపిణీ చేయనున్నారు. ఇందులో 300 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఇళ్లు 54,934 ఉండగా, 365 చదరపు అడుగులు ఉన్నవి 16,223, 430 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఇళ్లు 28,986 ఉన్నట్లు సమాచారం. ఏపీ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఉగాది పండుగ శుభముహూర్తాన ఈ సామూహిక గృహప్రవేశాలను ఘనంగా నిర్వహించాలని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్ల నిర్మాణాలపై తీవ్ర నిర్లక్ష్యం చేశారని, నిధులు మళ్లించడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడ్డారని కూటమి నేతలు ఆరోపించారు. లబ్ధిదారుల వాటాగా బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను కూడా గత ప్రభుత్వం ఇతర పనులకు వినియోగించడంతో చాలా మంది లబ్ధిదారుల ఖాతాలు నిరర్ధక ఆస్తులుగా మారిపోయాయని అధికారులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంతో టిడ్కో ఇండ్ల నిర్మాణ పనుల్లో వేగం పెరిగిందన్నారు. మౌలిక సదుపాయాల కల్పనపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నట్లు తెలిపారు.

కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లింపు..
నిధుల సమీకరణలో భాగంగా హడ్కో (HUDCO) నుండి ప్రభుత్వ గ్యారంటీతో రూ. 4,451 కోట్ల రుణాన్ని మంజూరు చేయించి కూటమి ప్రభుత్వం విజయం సాధించింది. వీటికి అదనంగా లబ్ధిదారుల వాటా ద్వారా మరో రూ. 1,500 కోట్లు సమకూరనున్నాయి. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన దాదాపు రూ. 500 కోట్ల బిల్లులను కాంట్రాక్టర్లకు కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. జూన్ నాటికి మిగిలిన అన్ని నిర్మాణాలను పూర్తి చేసి, లబ్ధిదారులకు ఇళ్లను అందజేసి వారి సొంతింటి కలను సాకారం చేయాలని అడుగులు పడుతున్నాయి.
టిడ్కో అంటే ఏమిటి..
టిడ్కో (TIDCO) అంటే Andhra Pradesh Township and Infrastructure Development Corporation. ఇది ఏపీ ప్రభుత్వ పరిధిలోని ఒక నోడల్ ఏజెన్సీ. పట్టణ ప్రాంతాల్లో నివసించే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు, అల్ప ఆదాయ వర్గాలకు తక్కువ ధరకే నాణ్యమైన ఇండ్లను నిర్మించి అందించడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. కేంద్ర ప్రభుత్వ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) పథకానికి అనుబంధంగా, ఏపీ ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఇండ్లను నిర్మించి ఇస్తోంది. ఇవి సాధారణ ఇళ్లు మాత్రమే కాకుండా, గేటెడ్ కమ్యూనిటీ తరహాలో మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు.
ఈ టిడ్కో ఇళ్ల నిర్మాణంలో అత్యాధునికమైన షీర్ వాల్ లేదా మోనోలిథిక్ కాంక్రీట్ టెక్నాలజీని ఉపయోగిస్తారని సమాచారం. దీనివల్ల ఇళ్లు చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఈ గృహ సముదాయాల్లో తారు రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ సౌకర్యం, తాగునీటి సరఫరాతో పాటు పార్కులు, కమ్యూనిటీ హాళ్లు వంటి వసతులను ప్రభుత్వం కల్పిస్తుంది. లబ్ధిదారుల ఆదాయ స్థాయిని బట్టి 300, 365, 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో వారికి ఇళ్లను కేటాయిస్తారు. పేద ప్రజలు సొంతింటి సాకారం చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
























