అప్పట్లో ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ లో రిజిస్టర్ చేసుకోవడం అనేది ఓ పెద్ద టాస్క్ లా ఉండేది. ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేయించుకుని వచ్చేస్తే ఇక ఉద్యోగం గ్యారంటీ అనే భావన కూడా కొందరిలో ఉండేది. ఆ తర్వాత ట్రెండ్ మారడంతో అంతా ఆన్ లైన్ అయిపోయింది. దీంతో నెమ్మదిగా ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ లో రిజిస్టర్ చేసుకునే వారి సంఖ్య తగ్గుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ట్రెండ్ ని ఫాలో అవుతూ మళ్లీ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. అయితే గతంలోలా కాకుండా ఈసారి డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ అందుబాటులోకి రానుంది.




రాష్ట్రవ్యాప్తంగా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే విధంగా చర్యలు చేపడుతున్నామన్న జగన్ సర్కార్…రాష్ట్రంలో ప్రతి జిల్లాలో నెలకు రెండు సార్లు మెగా జాబ్ మేళా నిర్వహిస్తామని చెప్పింది. ఈ మేరకు ఆగస్టు 15న డిజిటల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్ఛ్సేంజ్‌ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  జూన్ 22న ఐటీ శాఖపై సమీక్ష నిర్వహించిన సంబంధిత శాఖా మంత్రి మోకపాటి గౌతమ్ రెడ్డి ఈఎంసీ, ఐటీ ప్రమోషన్, పాలసీ తదితర అంశాలపై చర్చించారు. స్కిల్ కాలేజీల పనుల పురోగతి, నిధుల సమీకరణలో వేగానికి చర్యలు తీసుకోవాలని ఈ మేరకు అధికారులను సూచించారు. అన్ని ప్రధాన నగరాల్లోనూ ఐటీ రంగంలో ఎలా ముందుకెళ్లాలో ప్రణాళికలు రచించాలని సూచనలు చేశారు.




అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరచేందుకు కసరత్తు చేస్తున్నామని…ఎన్ని ఉద్యోగాలివ్వగలమన్నది నైపుణ్య, శిక్షణ ఎంత మందికి ఇచ్చామన్నదానిపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. అందుకు తగిన సహకారం, ఏర్పాట్ల గురించి మరింత దృష్టి పెట్టాలన్నారు. ఐ.టీ, ఎలక్ట్రానిక్, మొబైల్ తయారీ, టీవీ తయారీ, స్టీల్ కంపెనీల ద్వారా త్వరలో మరింత ఉపాధి కల్పన దిశగా అడుగులు వేస్తున్నామని, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ల ద్వారా అత్యాధునిక కోర్సులు, అపార అవకాశాలు.. సీవోఈల ఏర్పాటుపై మరింత శ్రద్ధ వహించాలని మంత్రి అధికార్లను కోరారు.


సీఎం సొంత జిల్లా భవిష్యత్ లో వైఎస్ఆర్ కడపలోని కొప్పర్తి ఈఎంసీ ద్వారా ఎక్కువ ఉద్యోగాలు వస్తాయన్నారు మంత్రి. ఇతర జిల్లాల్లో కంపెనీల స్థాపన.. పెట్టుబడుల ఆకర్షణకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనపైనా దృష్టిసారించామన్నారు. బ్యాంకులతో సంప్రదించి నిధులు తెచ్చుకునే మార్గాలపై అన్వేషించాలని అధికారులను ఆదేశించారు. నెల్లూరు జిల్లాలో తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని వెంకటగిరి, కర్నూలు జిల్లా డోన్ స్కిల్ కాలేజీల భూ సేకరణ పనుల పురోగతిపై ఆరాతీసిన గౌతమ్ రెడ్డి….అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న స్కిల్ కాలేజీ భూసేకరణ పనిని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు..